ఈ మాటల వెనక మర్మం ఏమిటి?!
ఒక పారిశ్రామిక వేత్త తాను పెట్టుబడులు పెట్టిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేయవచ్చా?. అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల సాధన కోసం విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అమరారాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ చైర్మన్ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటి?. దీని వెనక అజెండా ఏమైనా ఉందా?. ఇప్పటి వరకు గల్లా జయదేవ్ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం అటు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ లో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు భారీ ఎత్తున పారిశ్రామిక రాయితీలు ఇవ్వటానికి ఒప్పుకుంది. ఒప్పందం ప్రకారం తమకు ప్రభుత్వం రాయితీలు ఇస్తే పదేళ్ల కాలంలో తాము చెప్పిన మేరకు ఇక్కడ 9500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పారు. తమకు ఇస్తామన్న రాయితీలు...ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే మాత్రం విస్తరణ ప్రాజెక్ట్ విషయంలో ఇతర ప్రాంతాలపై దృష్టి సారించే అవకాశం ఉంది అని స్పష్టం చేశారు. శనివారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో కంపెనీ కొత్త కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (సిక్యూపీ) శంకుస్థాపన చేసిన సందర్భంగా మీడియా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వానికి సంకేతాలు పంపటానికి విస్తరణ ప్రాజెక్ట్ విషయంలో ఈ మాటలు చెపుతున్నారా అంటే అనుకోవచ్చు అంటూ గల్లా జయదేవ్ స్పందించటం విశేషం. ఒక వైపు తమకు ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బందులు లేవు అంటూనే...రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు అని...ఇండియా లో ఒక ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను మరో ప్రభుత్వం అమలు చేయకుండా ఇబ్బందులు సృష్టిస్తున్న విషయం తెలుసుకదా అంటూ గల్లా జయదేవ్ మాట్లాడారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడుల సాధన కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెపుతున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో గత జగన్ ప్రభుత్వంతో అమరారాజా గ్రూప్ పలు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వాస్తవానికి అక్కడ ప్రభుత్వం సహకరించి ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లోనే ఇప్పుడు తెలంగాణలో పెట్టిన యూనిట్ పెట్టే వాళ్ళు అనే ప్రచారం కూడా జరిగింది. తెలంగాణ ప్రభుత్వంతో ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు లేవు అంటూ గల్లా జయదేవ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విస్తరణ ప్రణాళికలపై బ్లాక్ మెయిల్ చేసినట్లు మాట్లాడటం సరికాదు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.