మంత్రులు 'సజ్జలకు అటు...ఇటు మాత్రమే'
జీవోలో చివరన..మాటల్లో మాత్రం ముందు వరసలో సజ్జల
సహజంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకే ఎక్కువ పవర్ ఉంటుంది. కానీ ఏపీలో మాత్రం అంతా రివర్స్ అన్నట్లు సాగుతోంది. జీవోలో మాత్రం ప్రాధాన్యత క్రమంలో ఆయన పేరు చివరిలో ఉంటుంది. కానీ మీడియా బ్రీఫింగ్ తోపాటు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల విషయంలో మాత్రం ఆయనే ముందు వరసలో ఉంటారు. చర్చల సారాంశాన్ని కూడా ఆయనే మంత్రులను పక్కన పెట్టుకుని చెబుతారు. మంత్రులు మాత్రం అలా చూస్తూ ఉంటారు. ఆ వ్యక్తే పవర్ ఫుల్ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి. జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ మాత్రం సలహాదారు సజ్జల మాట్లాడుతుంటే ఆయన పక్కన నిలబడి ఉంటారు. మరో మంత్రి పేర్ని నాని కూడా. మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ పర్యటన..తదితర కారణాల వల్ల ఇంకా ఇందులోకి రాలేదు. గత రెండు రోజులుగా పీఆర్సీ విషయంలో ఇదే సీన్ రిపీట్ అవుతోంది.
మంత్రులు ఏదైనా మాట్లాడినా కూడా అది సజ్జల మాట్లాడిన తర్వాత మాత్రమే. సహజంగా సలహాదారుల కంటే మంత్రులే చాలా ముందు వరసలో ఉంటారు. అందుకే పీఆర్సీ విషయంలో తలెత్తిన విభేదాలపై చర్చించేందుకు వేసిన సంప్రదింపుల కమిటీలో ముందు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు ఆ తర్వాత మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నానిల తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి పేరు ఉంటుంది. కానీ అమలు విషయంలో మాత్రం అంతా రివర్స్. ఈ తీరు చూసి ప్రభుత్వంలో ఉన్నతాధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అత్యంత సన్నిహితంగా ఉన్నందున సీనియర్ అయిన బొత్సతోపాటు ఇతర మంత్రులు ఉన్నా ఆయనే అన్నీ లీడ్ చేస్తున్నారని..ఇది పై వాళ్లను బట్టే ఉంటుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో మంత్రులను డమ్మీలను చేశారని విమర్శించిన వారే...అంతకు మించి చేస్తున్నారని ఓ అదికారి అభిప్రాయపడ్డారు.