Telugu Gateway
Telugugateway Exclusives

లోకేష్ భ‌య‌ప‌డుతున్నారా..బేరం పెడుతున్నారా?!

లోకేష్ భ‌య‌ప‌డుతున్నారా..బేరం పెడుతున్నారా?!
X

ఎంత‌సేపూ టీజ‌ర్లు త‌ప్ప‌..ట్రైల‌ర్ ఉండ‌దు..అస‌లు సినిమా విడుద‌ల కాదు. ఇదీ టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వ్య‌వ‌హారం. జ‌ర్న‌లిస్టుకు ఏదైనా పెద్ద వార్త దొరికితే అది రాయాలి. ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కుడికి ఏదైనా అధికార పార్టీ స్కామ్ దొరికితే అది బ‌హిర్గ‌తం చేయాలి. త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ది పొందుతామ‌ని చూస్తారు. అదేమి విచిత్ర‌మో కానీ నారా లోకేష్ మాత్రం ప్ర‌క‌ట‌న‌లు త‌ప్ప ప‌ని చేయ‌టం లేదు. స‌రిగ్గా మహానాడు ముందు కూడా త‌న దగ్గ‌ర వైసీపీ ప్ర‌భుత్వానికి సంబంధించి రెండు భారీ స్కామ్ లు ఉన్నాయ‌ని..వాటిని బ‌హిర్గ‌తం చేస్తే ఇక ప్ర‌భుత్వం అంతే అన్న స్థాయిలో క‌ల‌రింగ్ ఇచ్చారు. మూడు నెల‌లు అయిపోయింది ఇంత వ‌ర‌కూ ఆ స్కామ్ లు ఏంటో అతీగ‌తీ లేదు. పోనీ అక్క‌డితో ఆగిపోయారా అంటే అదీ లేదు. తాజాగా మ‌ళ్లీ ఆగ‌స్టు17వ తేదీన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూ వ‌చ్చే వారం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి సంబంధించిన అతి పెద్ద స్కామ్ బ‌హిర్గ‌తం చేస్తాన‌ని మ‌రోసారి ప్ర‌క‌టించారు. ముందు ప్ర‌క‌టించిన రెండు స్కామ్ లు ఎక్క‌డికిపోయాయో ఎవ‌రికీ తెలియ‌దు. త‌ర్వాత ఒక‌టి అన్నారు. అది కూడా ఇప్పటి వ‌ర‌కూ ఏమిటో బ‌హిర్గ‌తం చేయ‌లేదు.

ఆయ‌న చెప్పిన వారాలు గ‌డిచిపోతూనే ఉన్నాయి. ఈ వ్య‌వ‌హారం అంతా చూసిన టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ స‌ర్కారులో జ‌రిగిన స్కామ్ లు బ‌య‌ట‌పెట్టడానికి నారా లోకేష్ భ‌య‌ప‌డుతున్నారా..లేక స్కామ్ లు చేసిన వారితో బేరాలు పెడుతున్నారా అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తిసారి అవిగో స్కామ్ లు...ఇవిగో స్కామ్ లు అన‌టం త‌ప్ప అస‌లు విష‌యం మాత్రం బ‌య‌టికి రావ‌టం లేదు.. జ‌గ‌న్ సర్కారు స్కామ్ ల‌కు సంబంధించి లోకేష్ చేసిన ప్ర‌క‌ట‌న‌లు ఆయ‌న తీరుపై ప్ర‌జ‌ల్లో ప‌లు సందేహాలు రావ‌టానికి కార‌ణం అవుతున్నాయ‌ని..ఈ ఛాన్స్ నారా లోకేషే వారికి ఇచ్చార‌ని ఓ టీడీపీ సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు. స్కామ్ లకు సంబంధించి వ‌ర‌స ప్ర‌క‌ట‌న‌లు చేసి మౌనం దాల్చ‌టంతో స‌ర్కారుతో లాలూచీ ప‌డ్డారనే విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని..పార్టీకి లాభం చేయ‌క‌పోగా..ఇలాంటి చ‌ర్య‌ల‌తో ఆయ‌న మ‌రింత న‌ష్టం చేస్తున్నార‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల్లో వ్య‌క్తం అవుతోంది.

Next Story
Share it