పాలన స్పీడ్ కు ఇదో సంకేతమా?!
తెలంగాణ ప్రభుత్వంలో పనులు సాగుతున్న తీరుకు ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు నెలలుగా పదే పదే అదే మాట చెపుతున్నారు కానీ..అది అమలుకు నోచుకోవడంలేదు. పోనీ అదేమైనా అత్యంత సంక్లిష్టమైన అంశం..అందుకే జాప్యం జరుగుతుంది అనుకోవటానికి కూడా లేదు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానానికి కూడా బోర్డు వేయాలని ప్రతిపాదించారు. తెలంగాణాలో అత్యంత పేరుగాంచిన దేవాలయానికి బోర్డు వేసి... ఆ బోర్డు దేవస్థానం పాలనా వ్యవహారాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సహజంగా పెద్ద పెద్ద దేవాలయాలకు పాలక మండళ్లు ఉంటాయి. 2024 ఆగస్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. కానీ ఇప్పటి వరకు ఇది కార్యరూపం దాల్చలేదు. బోర్డు ఏర్పాటుకు అవసరమైన విధివిధానాల రూపకల్పన తో పాటు ఇతర అంశాలు ..క్యాబినెట్ ఆమోదం వంటి వాటికీ కూడా ఇంత కాలం పట్టింది అంటే తెలంగాణాలో పరిపాలన ఎంత వేగంగా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అది కూడా ముఖ్యమంత్రి ప్రతిపాదన...ఆయన చేయాలనుకుంటున్న పని. పోనీ ఇది ఏమీ వివాదాస్పద నిర్ణయం కాదు ఆచితూచి అడుగులు వేయాలి..అన్ని జాగ్రత్తగా చూడాలి అనటానికి. యాదగిరిగుట్టకు బోర్డు ఏర్పాటు వంటి వాటి విషయంలో కూడా గత కొన్ని నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి నోట పదే పదే అదే మాట వస్తుంది తప్ప..ఇది అమల్లోకి రావటం లేదు.
ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించి మరో సారి బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు మీడియా కు సమాచారం ఇచ్చారు. బోర్డు ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదాలో సీఎం పలు మార్పులు సూచించారు అని తెలిపారు. నిజంగా ప్రభుత్వం ఈ బోర్డు ఏర్పాటు విషయంలో సీరియస్ గా ఉంటే దీనికి కచ్చితంగా ఇంత సమయం పట్టదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. కారణాలు ఏమైనా కూడా ఇలాంటి వాటి విషయంలో కూడా విపరీత జాప్యం చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కావాలనుకుంటే టీటీడీ బోర్డు నుంచి దీనికి సంబంధించిన విధివిధానాలు ఒక్క రోజులో తెప్పించుకోవచ్చు అని..కానీ దీనికి కూడా ఐదు నెలలు పట్టింది అంటే ప్రభుత్వం ఎంత వేగంగా పరుగులు పెడుతుందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.