Telugu Gateway
Telangana

భ‌క్తుల‌కు అందుబాటులోకి 'తెలంగాణ తిరుమ‌ల‌'

భ‌క్తుల‌కు అందుబాటులోకి తెలంగాణ తిరుమ‌ల‌
X

తిరుమ‌ల త‌ర‌హాలో అభివృద్ధి చేసిన యాద‌గిరి గుట్ట (యాదాద్రి) సామాన్య భ‌క్తుల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. సోమ‌వారం నాడు ముఖ్య‌మంత్రి కెసీఆర్, మంత్రులు...ఉన్న‌తాధికారులు అట్టహాసంగా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వాస్త‌వానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని యాదాద్రి దేవాల‌యం ప్రారంభోత్స‌వానికి సీఎం కెసీఆర్ గ‌తంలో ఆహ్వ‌నం అంద‌జేశారు. కానీ మారిన ప‌రిస్థితుల్లో ఎవ‌రూ లేకుండా సీఎం కెసీఆర్ ఈ ప‌ని పూర్తి చేశారు. దీంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ క్రతువు వైభవంగా జరిపించారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి తరలివచ్చి నారసింహుడి సేవలో పాల్గొన్నారు. తొతలు బాలాలయం నుంచి స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, అళ్వారులు, అండాళ్‌ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని శోభాయాత్ర నిర్వహించారు. తిరువీధులతో ప్రదక్షిణ చేసి మూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొని, పూజలు చేశారు.

దివ్య విమాన రాజగోపురం వద్ద సోమ‌వారం ఉదయం 11:55 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త మిథునలగ్న అభిజిత్‌ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించారు. ప్రధానాచార్యులు నల్లంథీఘల్‌ లక్ష్మీనర్సింహాచార్యుల ఆధ్వర్యంలో సువర్ణ సుదర్శన చక్రానికి బంగారు కలశంలో నింపిన పవిత్ర నదీజలాలతో మహాకుంభాభిషేకం (సంప్రోక్షణ) నిర్వహించారు. అదే సమయంలో మిగతా గోపురాల వద్ద మంత్రులు కుంభ సంప్రోక్షణ చేశారు. చివరిగా సుదర్శన చక్రం చుట్టూ ప్రదక్షిణలు, హారతి నివేదన పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న దేవస్థానం అభివృద్ధి మండలి వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఆలయ ధర్మకర్త నర్సింహమూర్తి, ఆర్కిటెక్టు ఆనంద సాయి, మధుసూదన్, స్థపతులు సుందర రాజన్, ఆనందాచారి వేలు తదితరులను సీఎం, మంత్రులు సన్మానించారు. లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ఉద్ఘాటన, స్వయంభూ దర్శనం పునః ప్రారంభం కోసం వచ్చిన వీఐపీలు, వారి కుటుంబ సభ్యులు, భక్తులతో యాదాద్రి నిండిపోయింది.

సోమవారం మొదట సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, వారి కుటుంబ సభ్యులు ఆలయంలో నారసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాధారణ భక్తులను అనుమతించారు. అప్పటికే యాదగిరిగుట్ట పట్టణ శివార్లలో వేచి ఉన్న వేలాది మంది భక్తులు వరుసకట్టారు. కొండ దిగువన కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి.. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి యాదాద్రిపైకి చేరుకున్నారు. సుదూ ర ప్రాంతాల నుంచీ వచ్చిన భక్తులు స్వామి వారి స్వయంభూ విగ్రహాలను దర్శించుకున్నారు. పూర్తి రాతితో నిర్మించిన ఆలయాన్ని సందర్శించి భ‌క్తులు మంత్రముగ్ధులయ్యారు.

ఇక నుంచి యాదాద్రీశుడి ప్రధానాలయాన్ని ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు తెరుస్తారు. సుప్రభాతం, బిందెతీర్థం, ఆరాధన, బాలభోగం, నిజాభిషేకం, అలంకరణ, సహస్ర నామార్చన పూర్తిచేశాక.. 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సర్వ దర్శనాలు ఉంటాయి. మధ్యలో 8 గంటల నుంచి గంటపాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను అనుమతిస్తారు. మధ్యాహ్నం 12.45 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వ దర్శనాలు ఉంటాయి. మధ్యలో 4 నుంచి 5 గంటల వరకు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను అనుమతిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8.15 వరకు పూజలు జరుగుతాయి. తర్వాత 9.15 గంటల వరకు మళ్లీ సర్వ దర్శనాలు ఉంటాయి. తర్వాత రాత్రి నివేదన, శయనోత్సవం, ద్వార బంధనం నిర్వహిస్తారు.

Next Story
Share it