శంషాబాద్ విమానాశ్రయం కంటే యాదగురిగుట్టలోనే పార్కింగ్ ఫీజు ఎక్కువ

హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం కంటే ఓ గుడిలో పార్కింగ్ ఫీజు ఎక్కువ. అవాక్కు అవుతున్నారా?. అంతే మరి..యాదాద్రిలో ఇప్పుడు అదే జరుగుతోంది. యాదాద్రిలో ఏకంగా గంటకు 500 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు.అదనపు గంటకు మరో వంద రూపాయలు చెల్లించాలంట. విమానాశ్రయంలో మాత్రం 24 గంటలు పార్క్ చేసుకున్నా కూడా అంత ఛార్జీ ఉండదు. తొలుత అసలు కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించేదిలేదని ప్రకటించారు. తీరా ఇప్పుడు అనుమతి ఇస్తున్నారు. అనుమతి ఇచ్చి పార్కింగ్ ఫీజుల రూపంలో షాక్ ఇస్తున్నారు. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుమలలోని వెంకటేశ్వరస్వామి దగ్గర అసలు పార్కింగ్ ఛార్జీలే ఉండవు. అలిపిరి దగ్గర ఏదో నామమాత్రంగా 50 రూపాయలు వసూలు చేస్తారు.
కానీ యాదాద్రిలో ఏకంగా గంటకు 500 రూపాయలు ఛార్జీ నిర్ణయించారంటే అందరూ విస్మయానికి గురవుతున్నారు. ఈ అడ్డగోలుగా పార్కింగ్ వసూళ్ల పై ఇక్కడికి వస్తున్న భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి వాహనాలను అనుమతించడంతో ఎంతో సంతోషంగా వాహన దారులు తమ వాహనాలతో గుట్టపైకి వస్తున్నారు. తీరా పార్కింగ్ పేరిట బాదుడు చూసి అవాక్కు అవుతున్నారు. ఈ చార్జీల బాదుడు సామాన్య భక్తులకే అన్నమాట. ప్రొటోకాల్ ఉన్నవారికి, దాతలకు మాత్రం ఎలాంటి ఛార్జీలు ఉండవన్నారు. ఇటీవల యాదాద్రిను పూర్తిగా పునర్ నిర్మాణం చేసి భక్తులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే.