లక్ష మంది సమక్షంలో షర్మిల పార్టీ ప్రకటన
తెలంగాణలో పార్టీ ఏర్పాటుకు కసరత్తు వేగం చేసిన వైఎస్ షర్మిల మంగళవారం నాడు ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలోనే ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో లక్ష మంది సమక్షంలో పార్టీ ప్రకటన చేయనున్నట్ల వెల్లడించారు. తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పార్టీ పెడుతున్నాను తప్ప..టీఆర్ఎస్ లేదా బిజెపిలకు బీ టీమ్ గా ఉండాల్సిన అవసరం తనకు లేదన్నారు.
తాను ఎవరూ వదిలిన బాణం కాదని మరోమారు స్పష్టం చేశారు. పార్టీ విధివిధానాలను కూడా షర్మిల ఖమ్మం సమావేశంలో బహిర్గతం చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన నేతలు ఆమెను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరారు. ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కు అభిమానులు ఎక్కువ ఉండటంతో పాటు గతంలో వైసీపీ ఇక్కడ ఎంపీ సీటును కూడా గెలుచుకుంది. ఇప్పటికే పలు జిల్లాల నేతలతో సమేవశం అయిన షర్మిల వారి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.