Telugu Gateway
Telangana

వై ఎస్ షర్మిల ఫైటింగ్ స్పిరిట్... హాట్ టాపిక్ !

వై ఎస్ షర్మిల ఫైటింగ్ స్పిరిట్... హాట్ టాపిక్ !
X

తెలంగాణాలో అత్యంత కీలకమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లలో వాళ్ళు కొట్టుకొంటున్నారు. దీంతో ఆ పార్టీని అభిమానించే నాయకులు, క్యాడర్ కొంత గందరగోళంలో ఉన్నారు. ఈ తరుణంలో వైఎస్ఆర్ టి పీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల చూపిస్తున్న తెగువ, పోరాట స్ఫూర్తి రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అసలు ఎన్ని ఓట్లు వస్తాయి..ఎన్ని సీట్లు వస్తాయి..తెలంగాణ ప్రజలు ఆమె నాయకత్వాన్ని ఆమోదిస్తారా లేదా అనే అంశాలు తేలటానికి ఇంకా సమయం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో షర్మిల తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో తిరుగుతూ అధికార టిఆర్ఎస్ పై, ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏ జిల్లాకు వెళితే అక్కడి మంత్రులు..ఎమ్మెల్యేల అవినీతి పై మాట్లాడుతూ ముందుకు సాగుతున్నారు. ఈ కారణంగానే అధికార టిఆర్ఎస్ ఆమె పాదయాత్ర కు ఆటంకాలు కలిగిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా లోని నర్సంపేట లో పాదయాత్ర సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి కారణం అయ్యాయి. టిఆర్ ఎస్ కార్యకర్తలు షర్మిల బస చేసే బస్సు తో పాటు మరికొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. మంగళవారం నాడు షర్మిల దెబ్బ తిన్న వాహనాలతో ప్రగతి భవన్ వైపు వెళ్లటంతో పోలీస్ ఆమెను అరెస్ట్ చేసారు. ఆమె కూర్చున్న కారును అలాగే క్రేన్ వాహనంతో తరలించారు. తర్వాత ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ పార్టీలో షర్మిల తప్ప చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు. అయినా కూడా షర్మిల ఒంటరిగానే రాజకీయంగా దూకుడుగా వెళుతూ ముందుకు సాగుతున్నారు. చాలా రోజులు టిఆర్ఎస్ షర్మిల విమర్శలను పెద్ద గా పట్టించుకోనట్లు వ్యవహరించింది. తర్వాత మాత్రం కౌంటర్లు ఇవ్వటం స్టార్ట్ చేసింది. దీంతో షర్మిల మరింత దూకుడు పెంచారు. మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె గానే తప్ప తెలంగాణాలో ఆమె మరో గ్రౌండ్ ఏమి లేదు. ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసినట్లు తెలంగాణాలో వైస్సార్ ఇమేజ్ ఎంతమేరకు పని చేస్తోందో ఎన్నికల తర్వాత కానీ తెలియదు. షర్మిల బీఆర్ఎస్ పార్టీని బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఎంతో మందీ మార్బలం ఉన్న కాంగ్రెస్ వంటి పార్టీ చేయలేని పని షర్మిల చేశారు అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది.

Next Story
Share it