జగన్..కెసీఆర్ లపై షర్మిల వ్యంగాస్త్రాలు

రెండు తెలుగు రాష్ట్రాల జల జగడంపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లు ఏపీ క్రిష్ణాపై ప్రాజెక్టులు కడుతుంటే సీఎం కెసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించవచ్చు. కౌగిలించుకోవచ్చు..భోజనాలు పెట్టొచ్చు. స్వీట్లు కూడా తినిపించవచ్చు. ఇద్దరూ కలసి ఉమ్మడి శత్రువును ఓడించనూ వచ్చు.కానీ రెండు నిమిషాలు కూర్చుని నీటి పంచాతీయని మాట్లాడుకోలేరా?. అంటూ షర్మిల ప్రశ్నించారు. కేంద్రానికి వివాదాన్ని పరిష్కరించాల్సిన బాద్యత లేదా అన్నారు. వైఎస్ఆర్ టీపీ వచ్చే ఎన్నికల్లో సగం సీట్లను మహిళలకు కేటాయించనుందని తెలిపారు. కెసీఆర్ కు అసలు మహిళలు అంటే గౌరవం లేదన్నారు. ఇవాళ్టి నుంచి వందరోజుల్లో పాదయాత్ర మొదలుపెడతానని వైఎస్ షర్మిల తెలిపారు. కొత్త పార్టీని ప్రకటించిన ఆమె ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి పాదయాత్ర చేస్తానని చెప్పారు.
వైఎస్ఆర్ టీపీ రాజకీయ పార్టీ మాత్రమే కాదని.. సంక్షేమం కోసం పని చేసే రాజకీయ వేదిక అవుతుందని షర్మిల పేర్కొన్నారు. ''అధికారంలోకి వస్తే ఉద్యమకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించినట్లు ఉద్యమకారుల్ని గుర్తిస్తాం. ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేస్తాం. ఉద్యమకారులపై కేసులు ఇంత వరకు ఎత్తివేయలేదు. 1200 మంది ఉద్యమంలో చనిపోతే కేసీఆర్ కేవలం 400 మందినే గుర్తించారు. మైనార్టీలను బీజేపీ హేట్ బ్యాంక్‌గా చూపిస్తోంది. మైనార్టీలను కేసీఆర్ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు. కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారు అని షర్మిల విమర్శించారు.