Telugu Gateway
Telangana

వివరణ ఇస్తూ మరో వివాదంలో ఉప ముఖ్యమంత్రి

వివరణ ఇస్తూ మరో వివాదంలో ఉప ముఖ్యమంత్రి
X

దేశంలో ఎక్కడైనా ...ఏ రాష్ట్రంలో అయినా మెజారిటీ వచ్చిన పార్టీనే అధికారంలో ఉంటుంది. వాళ్ళకే పాలనాధికారం దక్కుతుంది అనే విషయం తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణాలో అధికార బిఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ ఓడించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన నినాదాల్లో ఒకటి పదేళ్ల అహంకారాన్ని పారద్రోలుదాం అంటూ పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చింది. ఇవి అప్పట్లో ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యాయి కూడా. ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లు యాదగిరిగుట్టలో లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో మల్లు భట్టి విక్రమార్క ఒక చిన్న పీటపై కూర్చోవటం పెద్ద వివాదం అయింది. మంత్రిని అవమానించారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగగా...ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా దీన్ని సాధ్యమైనంత మేర వివాదంగా మార్చటానికి ప్రయత్నించింది. ఒక వేళ నిజంగా అక్కడ పొరపాటు జరిగినా కూడా సీఎం రేవంత్ రెడ్డి పీటల విషయంపై ఫోకస్ పెట్టి మల్లు భట్టి విక్రమార్క కు, మరో మంత్రి కొండా సురేఖ కు చిన్న పీటలు వేయమని చెప్పే అవకాశం ఉండదు. అధికారులు తప్పు చేస్తే వాళ్లపై చర్యలు తీసుకోవాలి కానీ...ఇందులో సీఎం పీటల సైజు పై నిర్ణయాలు తీసుకుని ముందే వాళ్లకు చెపుతారు అంటే నమ్మటం కష్టమే. కాకపోతే యాదగిరి గుట్ట ఫోటో చూసిన వాళ్లకు మాత్రం ఏదో తేడా ఉంది అనే అభిప్రాయం కలగటం మాత్రం సహజం.

ఈ దుమారంపై తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అయన పీటల వివాదంపై వివరణ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు మరో కొత్త వివాదానికి..చర్చకు కారణం అయ్యాయనే చెప్పాలి. ‘నేను డిప్యూటీ సీఎం గా, ఆర్థిక మంత్రి గా రాష్ట్రాన్ని శాసిస్తున్నా. నేను ఎవరికో తలవంచేవాడిని కాదు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నా నిర్ణయాలే కీలకం. ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖలను ఉప ముఖ్యమంత్రిగా నేనే చూస్తున్నా ’ అంటూ స్పందించారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ....తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఇచ్చింది పాలించటానికా..శాసించటానికా?. తాను రాష్ట్రాన్ని శాసిస్తున్నాను అంటూ మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అటు అధికార, రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. గత ప్రభుత్వం పై ఏ విమర్శలు అయితే కాంగ్రెస్ నాయకులు చేశారో...ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే మోడల్ ఫాలో అవుతున్నారు అనే విమర్శలకు భట్టి వ్యాఖ్యలు ఛాన్స్ ఇచ్చినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. ఒక వివాదానికి వివరణ ఇవ్వబోయి ..ఆయన ఇప్పుడు తన వ్యాఖ్యల ద్వారా మరో వివాదంలో ఇరుక్కున్నారు అని..ఇవి ప్రజలకు ఏ మాత్రం సరైన సంకేతాలు పంపవు అని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it