లేకపోతే రెండేళ్లు చిక్కులే!

మొన్నటి ఎన్నికల్లో కెసిఆర్ ను ఢీకొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా కానీ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ చేసిన విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ విషయంలో కొండా సురేఖ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే సంగతి కాసేపు పక్కనపెడితే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి పై...ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేసిన సుస్మిత పటేల్ పై కూడా కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కి అధిష్ఠానం అండగా నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కళ్ళు నెత్తికెక్కాయని...ఆయన కుటుంబ సభ్యులు భూ దోపిడీకి పాల్పడుతున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే తెలంగాణ రాజకీయాల్లో..ముఖ్యంగా కాంగ్రెస్ లో రాజకీయ వేడి పెరిగింది. గత కొంత కాలంగా మంత్రి పదవి రాలేదు అనే అసంతృప్తితో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పై విమర్శల డోస్ పెంచారు. ఇవి అన్ని సెట్ అవుతాయా....అధిష్ఠానం అన్నిటిని సెట్ చేసిందా...రేవంత్ రెడ్డి కి ఢిల్లీ పెద్దల అండదండలు లభిస్తాయా లేదా అన్నదే ఇప్పుడు అత్యంత కీలకం కాబోతోంది. లేదు అంటే మిగిలిన రెండేళ్లు రేవంత్ రెడ్డికి ముళ్లబాట తప్పదు అనే చెప్పాలి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు విషయాల్లో రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు పోయారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు సొంత పార్టీ నాయకుల నుంచే.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆయన ఒక ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినట్లు నడుపుకుంటూ వచ్చారు అన్నది ఎక్కువ మంది ఆ పార్టీ నాయకులు చెప్పే మాట. ప్రభుత్వం అంటే తాను, మల్లు భట్టి విక్రమార్క మాత్రమే అన్న చందంగా ఇటీవల వరకు ప్రభుత్వ ప్రకటనల్లో కూడా ఇద్దరి ఫోటో లు మాత్రమే వేసుకున్నారు. కొద్ది రోజుల నుంచి మాత్రం ఆయా శాఖల మంత్రుల ఫోటో లు కూడా వేయటం ప్రారంభించారు. మరో కీలక విషయం ఏమిటి అంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఇద్దరు ముగ్గురు మంత్రులపైనే తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మంత్రిగా ఉన్న కొండా సురేఖ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం..తనకు సంబంధం లేదు అని చెప్పటం అంటే ఆమె ఈ వివాదాన్ని కొనసాగించటానికి నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉన్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయి చూడాలి.



