Telugu Gateway
Telangana

ఎల్అండ్ టిని టార్గెట్ చేసిన ఉత్తమ్

ఎల్అండ్ టిని టార్గెట్ చేసిన ఉత్తమ్
X

లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇందులో ప్రధానమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజిల్లో ప్రస్తుతం నీళ్లు నిల్వ చేసే ఛాన్స్ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ కింద ఆయకట్టుకు నీళ్లు అందటం అనుమానమే అని చెపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ పై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు నిర్వహించిన సమీక్ష కొత్త చర్చకు తెరలేపింది. ఈ సమీక్షలో ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గురి తప్పిందా..లేక కావాలని చేశారా అన్న చర్చ అటు అధికార, ఇటు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత కెసిఆర్ సర్కారు తప్పులను వదిలేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పూర్తిగా నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి)ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు, డ్యామ్ కు క్రాక్ ల వంటి వాటి విషయంలో నిజంగా నిర్మాణ సంస్థ తప్పులు ఉంటే ఏ మాత్రం ఆ కంపెనీని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కంపెనీదే తప్పు అయితే ఏ చర్యలు తీసుకున్నా ఎవరూ ఆక్షేపించరు. కానీ ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అంశాలు...జాతీయ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ అధికారులు కూడా ప్రధానంగా డిజైన్ల లోపం కారణంగానే సమస్యలు వచ్చాయని గుర్తించారు...ఈ విషయాన్నీ ప్రకటించారు కూడా. డ్యామ్ కు క్రాక్ లు...పిల్లర్లలో పగుళ్లు వస్తే అది నిర్మాణ లోపం అవుతుంది ....కానీ ఇక్కడ జరిగింది పిల్లర్లు కుంగటం వల్ల డ్యామ్ కు క్రాక్ లు వచ్చాయనే విషయం తెలిసిందే.

అంటే మేడిగడ్డలో నిర్మాణ లోపం కంటే....ప్రధాన సమస్య డిజైన్ల వల్లే అని నిపుణులు చెపుతున్న మాట. ఉత్తమకుమార్ రెడ్డి తన సమీక్షలో ఎక్కడా గత కెసిఆర్ ప్రభుత్వం పై...సాగునీటి శాఖ బాధ్యతలు చూసిన...తానే ఈ మొత్తం ప్రాజెక్ట్ డిజైన్ చేశానని గొప్పగా చెప్పుకున్నమాజీ సీఎం కెసిఆర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మంత్రి తన ఫోకస్ అంతా ఎల్ అండ్ టి పై పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి అటు అసెంబ్లీ లో..ఇటు బయట కూడా దీనిపై న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని చెపుతుంటే...ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం దీనికి బాద్యులు అయిన గత ప్రభుత్వంలోని అధికారులు..ఇంజినీర్లను పక్కన పెట్టి నిర్మాణ కంపెనీపై మాత్రమే ఫోకస్ పెట్టడం వల్ల ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ల ప్రకారమే పనులు చేశామని చెపుతూ వస్తోంది. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వంలో సాగునీటి శాఖ చూసిన కెసిఆర్ ను కానీ...డిజైన్లు ఓకే చేసిన అధికారులు..ఇంజినీర్లను ఒక్క మాట అనకుండా వన్ సైడ్ గా వెళ్లారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.



Next Story
Share it