Telugu Gateway
Telangana

కుల సంఘాలు..వ్యాపార సంఘాల మద్దతు తీర్మానాలా!

కుల సంఘాలు..వ్యాపార సంఘాల మద్దతు తీర్మానాలా!
X

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఎందుకీ పరిస్థితి?. సిరిసిల్ల సభలో చోటు చేసుకున్న పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 15 నుంచి బిఆర్ఎస్ ప్రెసిడెంట్, సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరుతో పెద్ద ఎత్తున పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. రోజుకు రెండు చోట్ల ఆయన బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే కెసిఆర్ మంగళవారం నాడు తొలుత సిరిసిల్ల లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గం నుంచి కెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడే ఒక కీలక ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఏ కెసిఆర్ సభలో కూడా జరగని విధంగా ఇక్క్డడ ఒక విచిత్ర ఘటన చోటు చేసుకోవటం అందరిలో ఆసక్తి రేపుతోంది. కెటిఆర్ కు మద్దతుగా సిరిసిల్ల లో ఉన్న ఇంచు మించి అన్ని కుల, వ్యాపార సంఘాలు తీర్మానాలు చేశాయి. అంతే కాదు వాళ్ళు అందరూ వేదిక ఎక్కి ఆ తీర్మాన ప్రతులను బహిరంగంగా చూపించి ...ఆ తీర్మానాల కాపీలను కెసిఆర్ కు అందచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గత పదేళ్ల కాలంలో ఏ నియోజకవర్గాలకు దక్కనన్ని నిధులు సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కు చెందిన సిరిసిల్ల తో పాటు మరో మంత్రి హరీష్ రావు నియోజకవర్గాలకు మాత్రమే దక్కాయనే విమర్శలు ఉన్నాయి.

మరి అలాంటిది ఎన్నికల ముందు అది కూడా కెటిఆర్ నియోజకవర్గంలో ఓట్ల కోసం ఇలా కుల సంఘాలు, వ్యాపార సంఘాలతో తీర్మానాలు చేయించటం ఏమిటి ...వాటిని ఏకంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో అందచేయటం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సిరిసిల్లకు ప్రవహించిన నిధులు, చేసిన పనులు చూపించి ధీమాగా ఉండాల్సిన కేటీఆర్ ఎక్కడా లేని విధంగా ఇలా తీర్మానాలు చేయించుకోవటం ఎలాంటి సంకేతాలు పంపుతుంది అనే చర్చ కూడా సాగుతోంది. ఈ మీటింగ్ లో మాట్లాడిన సీఎం కెసిఆర్ బతుకమ్మ చీరలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బతుకమ్మ చీరలు నిన్ను ఎవరు కట్టుకోమన్నరు. జబర్దస్త్ ఉందా?. ఎవరైనా బతిమిలాడిర్రా. కొంతమంది బతుకమ్మ చీరలను కాల్చి నానా యాగీ చేశారు. వీటిపై కూడా రాజకీయం చేశారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఈ చీరలు చేనేతల కన్నీళ్లు తుడిచేవి. ఒక గొప్ప మానవతా దృక్పధంతో చేప్పట్టిన పథకం అది. గతంలో ఇక్కడ ఆత్మహత్యలు ఉండేవి. మంత్రి కెటిఆర్ చేతిలోనే ఆ శాఖ కూడా కూడా ఉండటంతో చేనేతలకు మేలు చేసే ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓటు విషయంలో జాగ్రత్తగా ఉండాలని...లేక పోతే పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని హెచ్చరించారు.

Next Story
Share it