Telugu Gateway
Telangana

ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర ఆరోపణలు..ఇప్పుడు సైలెంట్

ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర ఆరోపణలు..ఇప్పుడు సైలెంట్
X

దీని వెనక ఉన్న మతలబు ఏంటో?

దేశంలో తనకు తప్ప ఎవరికీ విధానాలు లేవు..పాలించటం చేతకాదు అని గట్టిన నమ్మిన బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అధికారంలో ఉండగా దళిత బంధు అమలు కోసం వేల కోట్ల రూపాయల విలువ చేసే కోకాపేట భూములు అమ్మారు. కోకాపేట భూముల అమ్మకం ద్వారా వచ్చిన రెండు వేల కోట్ల రూపాయలను దళిత బందుకు ఉపయోగించామని అప్పటిలో బిఆర్ఎస్ కీలక నేతలే బహిరంగంగా చెప్పారు. అక్కడితో ఆగలేదు. 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ను కూడా ప్రైవేట్ పరం చేశారు. ఈ నిధులను కూడా ఎన్నికల ముందు నాలుగేళ్ళ పాటు పెండింగ్ పెట్టిన రైతు రుణ మాఫీ అమలుకు వాడినట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే కెసిఆర్ సర్కారు కోకాపేట భూముల విక్రయం తో పాటు ఓఆర్ఆర్ ను దీర్ఘకాలిక లీజ్ ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడాన్ని టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కోకాపేటలో ఉన్న అత్యంత ఖరీదు అయిన భూములను బిఆర్ఎస్ ప్రభుత్వం అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టింది అని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వెయ్యి కోట్ల రూపాయల స్కాం జరిగింది అని ఆరోపిస్తూ ఇదే విషయంపై ఢిల్లీ లో సిబిఐ కి కూడా ఫిర్యాదు చేశారు.

కోకాపేట భూముల తరహాలోనే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం తెచ్చిపెట్టే ఓఆర్ఆర్ ను దీర్ఘకాలిక లీజ్ పై ప్రైవేట్ సంస్థకు అప్పగించటం వెనక కూడా వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారాయని...అడ్డగోలుగా ప్రైవేట్ సంస్థకు ఓఆర్ఆర్ ను అప్పగించటం వల్ల ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ విషయంపై ఒక సమీక్ష నిర్వహించి ఈ లీజ్ విషయంలో సిబిఐ లేదా మరో కేంద్ర సంస్థతో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అటు కోకాపేట భూముల అమ్మకం ఆయినా.. ఇటు ఓఅర్ఆర్ లీజ్ విషయం అయినా స్వయంగా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన అంశాలే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాటి ఊసు ఎత్తకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు సిబిఐ కి ఫిర్యాదు చేసి...ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం వెనక కథ ఏమై ఉంటుందా అన్న చర్చ అటు రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది. ఈ వ్యవహారాలు అన్నిటిని అలాగే వదిలేస్తే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి కి..రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవి రాబోయే రోజుల్లో భారీ నష్టం చేసే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రతిపక్షంలో ఉండగా పలు కీలక అంశాలను పదే పదే ప్రస్తావించి ...అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరిస్తే ఎవరికైనా అనుమానాలు రావటం సహజం. ఇప్పుడు తెలంగాణ లో కూడా అదే జరుగుతోంది అని చెప్పొచ్చు. మరి రాబోయే రోజుల్లో అయినా స్వయంగా తాను లేవనెత్తిన అంశాలను అయినా సీఎం రేవంత్ రెడ్డి ఒక కొలిక్కి తెస్తారా లేక అలా వదిలేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. ఈ విషయాలపై ఎలాంటి యాక్షన్స్ ఉండకపోతే మాత్రం అవి కాంగ్రెస్ పార్టీ కి...రేవంత్ రెడ్డి కి మరకలుగా మిగలటం ఖాయం అనే చెప్పొచ్చు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయం తో పాటు పలు అంశాలపై కూడా ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంతసేపూ అధికారంలో ఉండి కూడా ఆరోపణలు చేయటం తప్ప..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా కూడా ఒక్క విషయంలో కూడా గత బిఆర్ఎస్ సర్కారు పెద్దలను ఫిక్స్ చేయటంలో విఫలం అయింది. ఈ విషయంలో కాంగ్రెస్ నేతల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it