అదానీ తో భేటీ విమర్శలపై మౌనం..బలపడుతున్న అనుమానాలు
ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీ లో చేరిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానానికి ‘కోహినూర్’లాగా మారిపోయారా?. అందుకే ఆయనకు ప్రభుత్వంలో అంత ప్రాధాన్యత దక్కటంతో పాటు ...వివాదాస్పద పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తో రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చినా ఇటు రాష్ట్ర పార్టీ కానీ..అటు జాతీయ నాయకత్వం మౌనంగా ఉందా అన్న అనుమానాలు కాంగ్రెస్ నాయకుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. ఆ నియోజకవర్గంతో ఏ మాత్రం సంబంధము లేకపోయినా కూడా తన వియ్యంకుడు రామసహాయం రఘురామి రెడ్డి కి ఖమ్మం ఎంపీ సీట్ కూడా దక్కేలా కూడా పొంగులేటి చేసుకున్న విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ పై ఎన్ని విమర్శలు ఉన్న రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో అయితే అదానీ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ వీటితో ఏ మాత్రం సంబంధం లేని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ లోని ప్రెసిడెన్షియల్ సూట్‌లో అదానీ తో సమావేశం అయ్యారు అని వార్తలు వచ్చాయి. ఇదే అంశంపై మాజీ మంత్రి, బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఈ భేటీ వెనక మతలబు ఏంటి అని ప్రశ్నించారు.
ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన సునీల్ కనుగోలు కూడా ఉన్నారు అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. కేటీఆర్ ఈ అంశాన్ని పలు మార్లు ప్రస్తావించినా కూడా పొంగులేటి మౌనాన్ని ఆశ్రయించటం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. కేటీఆర్ ఏదైనా రాజకీయ విమర్శలు చేస్తే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సవాళ్లు విసిరే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ విషయంలో మౌనంగా ఉండటంతో మొత్తానికి ఏదో జరిగింది అన్న చర్చ అటు రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ భేటీ కి కొద్ది రోజుల ముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి చెందిన నివాసాలు, ఆఫీస్ లపై పెద్ద ఎత్తున ఈడి దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈడీ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీటి అన్నిటిని ఇంటర్ లింక్ చేసి కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారు. మరో వైపు కేటీఆర్ హైదరాబాద్ లోని వందల కోట్ల రూపాయల విలువ చేసే 80 ఎకరాలకు పైగా భూమిని అదానీ కి కట్ట బెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. వీటికి సంబంధించిన ఏ అంశంపై కూడా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ...ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చిన దాఖలాలు లేవు.