ఓఆర్ఆర్ పై లీగల్ నోటీసులు...ఇప్పుడు కెటిఆర్ కిక్కురుమనటం లేదు ఎందుకో?!
ఓఆర్ఆర్ పై ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు
అమరవీరుల స్మారకం అవినీతిపై మాత్రం సైలెంట్
అంటే అవినీతిని ఒప్పుకున్నట్లేనా?!
అంచనాలు పెంచకుండా ఒక్క పని అయినా చేశారా?
రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్ మారిన వ్యవహారం
తెలంగాణ లోని కెసిఆర్ సర్కారు అంచనాలు పెంచకుండా ఒక్కటంటే ఒక్క పని అయినా పూర్తి చేసిందా అంటే నో అనే చెపుతున్నారు అధికారులు. అటు సాగు నీటి ప్రోజెక్టుల దగ్గర నుంచి మొదలు పెట్టి ప్రతి నిర్మాణ పనులలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే దేశంలోనే అతి పెద్ద స్కాంగా అటు రాజకీయ పార్టీలతో పాటు కొంత మంది నిపుణులు కూడా చెపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం విషయానికి వస్తే కొత్తగా కట్టిన సచివాలయం దగ్గర నుంచి ప్రగతి భవన్, చివరకు ఇప్పుడు అమరవీరుల స్మారకంలోనూ అవినీతి ఆరోపణలు రావటం అంటే ఇంత కంటే దారుణం మరొకటి ఉండదు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ సర్కారు తాను చెప్పే మాటలకూ బిన్నంగా ఓఆర్ఆర్ ను 30 సంవత్సరాల పాటు లీజ్ కు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తే వెంటనే లీగల్ నోటీసు లు ఇచ్చారు. ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేశారు అని వాటికి క్షమాపణ చెప్పక పోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఇది మంత్రి కెటిఆర్ శాఖకు సంబదించిన వ్యవహారమే అన్న విషయం తెలిసిందే. ఇదే రేవంత్ రెడ్డి గతంలో కెటిఆర్ ఫార్మ్ హౌస్ కు సంబంధించి, డ్రగ్స్ అంశంపై ఆరోపణలు చేయగా కోర్టు కి వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు మాత్రం అమరవీరుల స్మారకం విషయంలో రేవంత్ రెడ్డి నేరుగా పేరు పెట్టి మంత్రి కెటిఆర్ పైన, కెసిఆర్ సర్కారుపైన తీవ్రమైన విమర్శలు చేసినా కూడా కిక్కురుమనకుండా ఉన్నారు అంటే దీని వెనక కూడా అవినీతి జరిగింది అనే ఆరోపణలు నిజమే అని నమ్మే అవకాశాలు లేక పోలేదు అని అధికారులు అబిప్రాయపడుతున్నారు.
మరి గతంలో లీగల్ నోటీసులు ఇచ్చి బెదిరించిన వారు ఇప్పుడు మౌనంగా ఉండటంతో అనుమానాలు బలపడుతున్నాయి అని చెపుతున్నారు. ఇదే రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం బిఆర్ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డి కి చెందిన ట్రస్ట్ సాయి సింధూజ ఫౌండేషన్ కు వేల కోట్ల రూపాయల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టారు అని ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చారు. తర్వాత తెలంగాణ హై కోర్టు కూడా ఈ కేటాయింపులను తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. అధికారులు ఈ సంస్థకు పది ఎకరాలు ఇవ్వాలని సూచిస్తే కెసిఆర్ క్యాబినెట్ మాత్రం ఉదారంగా 15 ఎకరాలు కేటాయించింది. ఇలా రేవంత్ రెడ్డి ఆధారాలతో మాట్లాడిన అంశాలపై మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు అమరవీరుల స్మారకం విషయంలో కూడా అదే జరిగింది. తొలుత ఈ పనికి 63 .75 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి..పని పూర్తి అయ్యే నాటికి దీని అంచనా వ్యయాన్ని ఏకంగా 179 కోట్ల 5 లక్షల రూపాలకు పెంచారు అన్నారు. ఇందులో మంత్రి కెటిఆర్ స్నేహితులు ఉన్నారు అని పేరు పెట్టి మరీ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. అయినా కెటిఆర్ మౌనం దాల్చటం పలు అనుమానాలకు తావిస్తోంది అని చెపుతున్నారు. అంటే ఆధారాలు ఉన్న అవినీతిపై మాత్రం మౌనం దాల్చుతారు...లేదంటే మాత్రం లీగల్ నోటీసులు పంపుతారు అన్న మాట.