Telugu Gateway
Telangana

తెలంగాణ విద్యావ్యవస్థను కెసిఆర్..కేటీఆర్ నమ్మరా?!

తెలంగాణ విద్యావ్యవస్థను కెసిఆర్..కేటీఆర్ నమ్మరా?!
X

తెలంగాణ లో ఎవరూ చేయనంతగా వైద్య రంగాన్ని అభివృద్ధి చేశామని సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు చెపుతుంటారు. కానీ సీఎం కెసిఆర్ మాత్రం పంటి నొప్పి, కంటి నొప్పి చికిత్సకు మాత్రం ఢిల్లీ వెళతారు. ఇదేంటో ఎవరికి అర్ధం కాదు. ప్రజల విషయంలో అయితే నిర్లక్ష్యం వహిస్తారేమో కానీ...స్వయానా ముఖ్యమంత్రి అంటే అధికారులు, డాక్టర్ లు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయినా సీఎం కెసిఆర్ మాత్రం పలు మార్లు ఢిల్లీలో పంటికి..కంటికి చికిత్స చేయించుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సీన్ ఇక్కడ కట్ చేస్తే...తెలంగాణ విద్యా రంగాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తండ్రీ కొడుకులు అంటే సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ లు వేదికల మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. కానీ మంత్రి కెటిఆర్ మాత్రం తన కొడుకు హిమాన్షు ను అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ) లో చేర్చుతున్నారు. అందుకోసం ఆయన శనివారం రాత్రి అమెరికా బయలుదేరి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి..దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విద్యార్థులు ఎక్కువగా అమెరికా, కెనడా...సింగపూర్ వంటి దేశాలకు వెళతారు. అయితే అది ముఖ్యంగా ఎంఎస్ (మాస్టర్ ఇన్ సైన్స్) కోసమే ఉంటుంది. కానీ అండర్ గ్రాడ్యుయేట్ కోసం పోయేవారి సంఖ్య చాలా చాలా పరిమితంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంఎస్ కంటే అండర్ గ్రాడ్యుయేట్ ఖర్చు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు కు డబ్బు సమస్య ఉండే అవకాశమే లేదు. కాబట్టి అది పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ పదేళ్లుగా తెలంగాణను పరిపాలిస్తూ విద్యా రంగంలో ఎన్నో అద్భుతాలు చేశామని చెప్పుకుంటూ... చివరకు కొడుకును మాత్రం డిగ్రీ కూడా అమెరికాలో చదివించాలని నిర్ణయానికి వచ్చారంటే ప్రజలకు ఏమి సంకేతాలు వెలతాయనే చర్చ బిఆర్ఎస్ వర్గాల్లో కూడా సాగుతుంది.

ఎన్నికల ముందు ఈ నిర్ణయం ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంటే గత పదేళ్లుగా తాము అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న విద్యా వ్యవస్థను చివరకు కెసిఆర్ కుటుంబం కూడా నమ్మటం లేదా అనే విమర్శలు రావటం ఖాయం అని చెపుతున్నారు. కొద్ది రోజుల క్రితమే హిమాన్షు ఒక ప్రభుత్వ పాఠశాలను చూసి తనకు ఏడుపు వచ్చింది అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ పాఠశాలను వివిధ మార్గాల ద్వారా నిధులు సమీకరంచి బాగు చేయించారు కూడా హిమాన్షు. వాస్తవానికి మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ తన కొడుకు అండర్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ కోసమే అని...కానీ పనిలో పనిగా పెట్టుబడులపై చర్చలు అనే అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారని ఒక అధికారి వెల్లడించారు. ఎందుకంటే సెప్టెంబర్ లో ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ రావొచ్చు...ఎన్నికల ముందు భారీ పెట్టుబడుల వంటి అంశాలపై ఏ కార్పొరేట్ కంపెనీ కూడా నిర్ణయం తీసుకోదు. అసలు రాష్ట్రంలో అటు అధికార బిఆర్ఎస్ తో పాటు అన్ని పార్టీలు ఎన్నికల రంగంలోకి దిగిన వేళ కెటిఆర్ పెట్టుబడుల కోసం ఇప్పుడు అమెరికా వెళుతున్నారు అంటే నమ్ముతారా అని ఒక అధికారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆయన ఇదే పేరుతో అమెరికాలో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. మరీ ఈ సమయంలో కేవలం కొడుకు పని కోసమే వెళుతున్నట్లు కనిపించటం ఎందుకు అని...ఇలా ప్లాన్ చేశారు అని పార్టీ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి.

Next Story
Share it