Telugu Gateway
Telangana

ఎక్కడో లెక్క తేడా కొడుతోంది!

ఎక్కడో లెక్క తేడా కొడుతోంది!
X

బిఆర్ఎస్ ఎందుకంత భయపడుతోంది?!

తెలంగాణ లో బిఆర్ఎస్ పాలన దేశానికే ఆదర్శం..అసలు తెలంగాణాలో ఉన్న అన్ని స్కీములు దేశంలో ఎక్కడా లేవు. చివరకు కేంద్రం కూడా మా పథకాలే కాపీ కొడుతోంది అంటూ నిన్న మొన్నటి వరకు చెప్పుకున్నారు ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు. పాలన అంటే అసలు కెసిఆర్ కు తెలిసినంతగా ప్రస్తుతం ఉన్న ప్రధాని మోడీ తో సహా అంతకు ముందు పాలించిన ప్రధానులు కూడా చేత కాలేదు అంటూ మాట్లాడారు. అందరూ తెలంగాణను చూసే నేర్చుకుంటున్నారు అని ప్రకటించారు కూడా . కానీ ఇప్పుడు మంత్రులు కెటిఆర్, హరీష్ రావు లు కెసిఆర్ ప్రకటించబోయే హామీలు , శుభవార్తల కోసం చూడండి అంటూ టీజర్లు ఇస్తున్నారు. ఇక మంత్రి హరీష్ రావు అయితే బిఆర్ఎస్ మేనిఫెస్టో వస్తే ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవుతుంది అంటూ పదే పదే చెపుతున్నారు. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయితే పర్వాలేదు కానీ అవి చూసి ప్రజల మైండ్ బ్లాంక్ అయితే మాత్రం వచ్చే ఓట్లు కూడా రాకుండా పోతాయేమో చూసుకోండి అంటూ సోషల్ మీడియా లో కొంత మంది వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ లు మర్చిపోయిన విషయం ఏమిటి అంటే గత పదేళ్లుగా తెలంగాణను పాలిస్తూ దేశంలోనే ఆదర్శమైన, అద్భుతమైన పాలన ఇచ్చామని ...అసలు రాష్ట్రంలో ఉన్న అన్ని పథకాలు దేశంలో ఎక్కడా కూడా లేవు అని చెప్పుకుంటూ ఇంకా మళ్ళీ ఎన్నికల ముందు మేనిఫెస్టో పై ఆధారపడుతున్నారు అంటే అంతకు ముందు చెప్పిన మాటలు అన్ని అబద్ధాలా..లేక వాటితో ప్రజలు తమకు ఈ సారి ఓట్లు వేయరు అని భయపడుతున్నారా అన్న చర్చ సాగుతోంది.

తెలంగాణ సాధించిన పార్టీగా..పదేళ్లు అద్బుతమైన పాలన ఇచ్చాం అని చెప్పుకుంటూ ...మరో సారి గెలవటానికి మేనిఫెస్టో లో ఆకర్షణీయమైన హామీలు ఇవ్వబోతున్నారు అంటే ఎక్కడో లెక్క తేడా కొడుతోంది అనే భయం బిఆర్ ఎస్ లో మొదలైంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది . అందుకే ఇప్పుడు మేనిఫెస్టో జపం చేస్తున్నారు అని చెపుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలు అధికార బిఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే బిఆర్ఎస్ నాయకులు అందరూ వాటినే టార్గెట్ చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సిక్సర్ కు కౌంటర్ గానే బిఆర్ ఎస్ మేనిఫెస్టో లో కొత్త హామీలు..పాత వాటికి మరింత అదనపు ఆకర్షణల జోడింపు ఉండే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది బిఆర్ఎస్ వర్గాల్లో. పదేళ్ల పాటు అద్భుత పాలన ఇచ్చాం అని చెప్పుకునే వాళ్ళు దాన్ని చూసి ఓటు వేయమని అడిగే సాహసం చేయలేక మళ్ళీ కొత్త హామీలతో ముందుకు రాబోతున్నారు అంటేనే బిఆర్ఎస్ ఎంత టెన్షన్ లో ఉందో అర్ధం అవుతుంది. ఒక వైపు అధికార బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ఆరు హామీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీటికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారు అని ప్రశ్నిస్తున్నారు...కానీ బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన రకరకాల బంధుల ప్రకటనలు మాత్రం కన్వీనెంట్ గా మర్చిపోతున్నారు ఆ పార్టీ నేతలు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎవరి మాటలు నమ్ముతారో.

Next Story
Share it