Telugu Gateway
Telangana

మాటలు తప్ప ..చేతలు నిల్ !

మాటలు తప్ప ..చేతలు నిల్ !
X

ఎన్నికలకు ముందు ఇంటి గుట్లు రచ్చ చేసుకోవటం ఎందుకు అనుకున్నారా?. లేక మైనంపల్లి ఆరోపణలు చేసింది హరీష్ రావు మీద కదా అని వదిలేశారా?. మైనంపల్లి పై చర్యలు తీసుకుంటే అది కొత్త తలనొప్పులు తెస్తుంది అని భయపడ్డారా? ఇదే ఇప్పుడు అధికార బిఆర్ఎస్ నాయకులు, క్యాడర్ లో సాగుతున్న చర్చ. హరీష్ రావు పార్టీలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు..ఇప్పుడు ఎలా ఉన్నారు. వెలమ హాస్టల్ కు రబ్బరు చెప్పులు ...ట్రంక్ డబ్బాతో వచ్చాడు. ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాడు హరీష్. ఇవన్నీ గమనించాలి. నూటికి నూరు పాళ్ళు హరీష్ రావు కు బుద్ది చెపుతాను అంటూ మైనంపల్లి కొద్ది రోజుల క్రితం తిరుమల వేదికగా సంచనల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది బిఆర్ఎస్ లో పెద్ద కలకలమే రేపింది.అయినా కూడా మల్కాజిగిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు పై చర్యలకు పార్టీ అధిష్టానం సాహసం చేయలేదు. దీని వెనక బలమైన కారణాలు ఉన్నాయనే చర్చ సాగుతోంది. అది ఏంటి అంటే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన పెద్ద పెద్ద ల్యాండ్ డీల్స్ చాలా వరకు మైనంపల్లి కి తెలుసు అని...అధిష్టానం చర్యలు తీసుకుంటే ఎన్నికల ముందు మైనంపల్లి కీలకనేతల ల్యాండ్ డీల్స్ బయటపెడితే అటు రాజకీయంగా...ఇటు ఇమేజ్ పరంగా దెబ్బపడుతుంది అనే భయంతోనే అటు సీఎం కెసిఆర్, ఇటు మంత్రి కెటిఆర్ లు మౌనం దాల్చారు అనే ప్రచారం బిఆర్ఎస్ వర్గాల్లో ఉంది. హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేసి చాలా కాలం అయినా కూడా అధిష్టానం అసలు ఈ విషయాన్ని పట్టించుకోకపోగా...మైనంపల్లి తనంతట తాను బిఆర్ఎస్ కు రాజీనామా చేసే వరకు కూడా మౌనం దాల్చటం అంటే ఇది పక్కా భయంతో చేసింది తప్ప మరొకటి కాదు అని ఒక కీలకనేత అభిప్రాయపడ్డారు.

మైనంపల్లి వ్యాఖ్యలపై బిఆర్ఎస్ టికెట్ల ప్రకటన సమయంలో పార్టీ అధినేత, సీఎం కెసిఆర్ స్పందించారు. ‘పార్టీ వ్యతిరేకంగా ఎవరు పోయినా సరే ...వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు అయినా సరే తీసి అవతల పడేస్తాం. క్రమశిక్షణ చర్యలు చిన్న చిన్నగా ఉండవు. తీసి అవతల పడేస్తాం. వాళ్ళ ఖర్మకు వాళ్ళు పోతారు.’ అంటూ సీరియస్ గా మాట్లాడారు. కానీ చర్యలు లేవు. మంత్రి కేటీఆర్ కూడా మైనంపల్లి కామెంట్స్ పై విదేశాల్లో ఉండి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హరీష్ రావు వెంట బిఆర్ఎస్ పార్టీ మొత్తం నిలబడుతుంది అని....పార్టీ పెట్టినప్పటినుంచి హరీష్ రావు వ్యవస్థాపక అంతర్గత సభ్యుడు అని..రాబోయే రోజుల్లోనూ పార్టీలో ముఖ్యమైన పిల్లర్ గా ఉంటారు అంటూ స్పందించారు. తమ కుటుంబ సభ్యుడికి టికెట్ రాలేదు అనే కోపంతో తమ ఎమ్మెల్యే ఒకరు హరీష్ రావు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అటు సీఎం కెసిఆర్ అయినా...ఇటు మంత్రి కెటిఆర్ లు అయినా అప్పటికప్పుడు ప్రకటనలు చేశారు కానీ...తర్వాత అసలు ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతోనే భయపడే కెసిఆర్,కేటీఆర్ లు మైనంపల్లి పై చర్యలు తీసుకోలేకపోయారు అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళటం ఖాయం అని పార్టీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. వేరే పార్టీ లో చేరిన తర్వాత మైనంపల్లి ఎలాంటి విషయాలు బహిర్గతం చేస్తారు అనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో సాగుతోంది.

Next Story
Share it