Telugu Gateway
Telangana

జనసేన సభకు తెలంగాణ సర్కారు నో

జనసేన సభకు తెలంగాణ సర్కారు నో
X

జనసేనను నిజంగా తెలంగాణాలో బలోపేతం చేయాలనుకుంటున్నారా?. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన ఇక్కడ పోటీ చేస్తుందా?. లేక కేవలం త్వరలో జరగనున్న జీహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీకి లబ్ది చేకూర్చటం కోసమే ఇప్పుడు సడన్ గా జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ తలపెట్టారా అన్న చర్చ సాగుతోంది రాజకీయ వర్గాల్లో. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ తో పాటు జనసేన, బీజేపీ లు కూటమిగా ఉన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా గతంలో ఎప్పుడూ లేని రీతిలో హైదరాబాద్ లో ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి... పరామర్శ కోసం అంటూ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది అంతా కూడా రాజకీయ కోణంలో జరిగింది అనే చర్చ సాగింది. ముఖ్యంగా త్వరలో జరగనున్న జీహెచ్ఎంసి ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ వేసిన ప్లాన్ గా ఎక్కువ మంది భావించారు. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న ప్రకటనలు కూడా అలాగే ఉంటున్నాయి.

ఏ పార్టీ అయినా...ఏ నాయకుడు అయినా ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు...ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కాకపోతే ఆ నాయకులు ఒక ప్రాంతం గురించి గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కొద్ది రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణా వాళ్ళ దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరిచెట్లు ఎండిపోతున్నాయి అని..అంతకు ముందు తెలంగాణా వచ్చిన తర్వాత తాను కొన్ని రోజులు అన్నం కూడా తినలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకోవటంతో అవి అన్నీ ఇప్పుడు మరో సారి తెరమీదకు వస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణాలోని రేవంత్ రెడ్డి సర్కారు జూన్ రెండున ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' సభకి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.

ఇది ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. 2000 మంది జనసేన సాధక్ లతో ఒక ఇండోర్ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించటం సరికాదు అని జనసేన వాదిస్తోంది. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్ లో నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ కంపెనీల సమావేశాలు జరుగుతూనే ఉంటాయి అని... ఎప్పుడూ రాని పార్కింగ్ సమస్య , శాంతి భద్రతల సమస్య జనసేన పార్టీ కార్యక్రమానికి అడ్డంకిగా చూపి అనుమతి నిరాకరించడం సహేతుకం కాదు అని జనసేన ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూడటం...గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతోనే అనుమతి నిరాకరించినట్లు పోలీస్ అధికారులు చెపుతున్నారు. అయితే ఇదే అంశంపై జనసేన కోర్టు ను ఆశ్రయించింది. అన్నిటికి అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై అంతగా ఫోకస్ పెట్టడం వెనక ఎజెండా ఏంటి...అసలు ఆయన ప్లాన్ ఏంటి అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Next Story
Share it