Telugu Gateway
Telangana

ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?

ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా?
X

తెలంగాణ రాజకీయాల్లో నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఇప్పుడు దుమారం రేపుతోంది. ప్రభుత్వంలోనే కాకుండా ఇది మీడియా సంస్థల మధ్య ఫైట్ గా కూడా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణలో ఆర్థిక, విద్యుత్ శాఖలు చూసే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం నాడు ఈ అంశంపై స్పందించిన తీరు పలు అనుమానాలు లేవనెత్తటంతో పాటు పలు కొత్త ప్రశ్నలకు ఛాన్స్ ఇచ్చింది. ఆదివారం నాడు ఆంధ్ర జ్యోతిలో ఆ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్తపలుకు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారానికి కారణం అయింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగమేఘాల మీద స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ఒక అంశంపై ప్రభుత్వం నుంచి ఇంత వేగంగా స్పందన రావటం ఇదే మొదటి సారి అని చెప్పొచ్చు. దీంతోనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉలిక్కిపడి...ఎప్పుడో 2009 లో చనిపోయిన రాజశేఖర్ రెడ్డి పేరు ప్రస్తావించారు అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో ఆంధ్ర జ్యోతిలో వచ్చిన వార్తకు కౌంటర్ గా ఆయన చేసిన ప్రకటనలు కూడా పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో ఏదో భారీ కథే ఉంది అన్న చర్చ సాగుతోంది.

స్వయంగా మల్లు భట్టి విక్రమార్కే ఇప్పటి వరకు నైని బ్లాక్ పనులు దక్కించుకునేందుకు ఒక్క కంపెనీ కూడా బిడ్ వేయలేదు అన్నారు. ఈ బొగ్గు గని ఉన్న ప్రాంతాన్ని సందర్శించాలి అనే నిబంధన ఎప్పుడూ ఉండేదే చెపుతున్నారు. ఇక్కడే పలు అనుమానాలు వస్తున్నాయి. ఒక వైపు సింగరేణి అధికారులు కూడా ఇంకా ఒక్క కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయలేదు అని చెప్పినప్పుడు ...సైట్ ని విజిట్ చేసిన సంస్థలు అన్నింటికీ సర్టిఫికెట్ ఇచ్చేసి పోటీ ఉండేలా చేయవచ్చు కదా?. ఇదే అంశంపై ఒక రోజు ముందే ఆంధ్ర జ్యోతిలోనే బ్యానర్ స్టోరీ వచ్చింది. అప్పుడు అసలు ఏ మాత్రం స్పందించని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కొత్త పలుకులో ఆయన పేరు రాయటంతోనే ఆగమేఘాలమీద దీనిపై స్పందించినట్లు కనిపిస్తోంది. నిజంగా భట్టి పరిధిలో ఉండే విద్యుత్ శాఖ ఈ టెండర్ విషయంలో అంత పారదర్శకంగా ఉంటే మీడియా లో వచ్చిన ఒక్క ఆర్టికల్ తో టెండర్ రద్దు చేస్తుందా?. ఎవరైనా సరే ఈ టెండర్ లో పాల్గొనవచ్చు ...ఎవరు విజిట్ చేస్తే వాళ్లకు సర్టిఫికెట్ ఇస్తాం అని చెప్పకుండా ఇప్పుడు టెండర్ రద్దు నిర్ణయం తీసుకోవటంతోనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ కండిషన్స్ అయితే పెడతాయో వాటితోనే మరో సారి టెండర్ పిలవాలి అని సింగరేణి ని ఆదేశించటం వెనక మతలబు ఏంటి?. నిజంగా ప్రస్తుత టెండర్ లో తప్పు ఏమీ లేకపోతే ఇదే టెండర్ కొనసాగించి అందరిని అనుమతించి ఉండొచ్చుగా. తాను రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడిని కాబట్టే ఆయనపై ఉన్న కోపం ఇప్పుడు తనపై చూపిస్తున్నారు అని భట్టి విక్రమార్క చెప్పటం చూస్తే అసలు ఈ విషయం ఎవరైనా నమ్ముతారా?. ఎప్పుడో 2009 లోచనిపోయిన రాజశేఖర్ రెడ్డి పై కోపం ఇప్పుడు ఎవరైనా సరే భట్టిపై తీర్చుకుంటున్నారు అంటే అసలు ఇది నమ్మే అంశమేనా?. మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాను...రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఉన్నాను అని చెప్పటం ద్వారా ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తాను వై ఎస్ వర్గం తప్ప..ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వైపు కాదు అని చెప్పినట్లు ఉంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన హిల్ట్ పాలసీ దగ్గర నుంచి మూసి పునర్జీవ ప్రాజెక్ట్ విషయంలో కూడా బిఆర్ఎస్ ఇంత కంటే భారీ భారీ ఆరోపణలే చేసింది రేవంత్ రెడ్డి సర్కారుపై. వీటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కొంత మంది మంత్రులు కౌంటర్లు ఇచ్చారు తప్ప..ఒక ప్రాజెక్ట్ విషయంలో కూడా వెనక్కు పోలేదు. కానీ మల్లు భట్టి విక్రమార్క మాత్రం ఇప్పుడు సడన్ గా టెండర్ కు రద్దు ఆదేశాలు జారీ చేయటం కూడా హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఒక ఛానల్ అధినేత నివాసంలో నిత్యం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లతో పాటు లంచ్ మీటింగ్ లకు హాజరు అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని...వాళ్ళిద్దరి మధ్య బంధం కాంగ్రెస్ పార్టీ లో ప్రతి నాయకుడికి తెలుసు అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

ఆంధ్ర జ్యోతిలో వచ్చిన ఆర్టికల్ పై స్పందిస్తూ తాను తెలంగాణ వనరులు ప్రజలకు అందించటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. తన జీవితం పారదర్శకంగా ఉంటుంది అని...అధికారం హోదా అనుభవించడానికి రాజకీయాల్లోకి రాలేదు అని వ్యాఖ్యానించారు. దోపిడీదారులు క్రిమినల్స్ నుంచి రాష్ట్రాన్ని,ప్రజలను రక్షిస్తాను అని చెప్పారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కొత్త పలుకులో తనకు తోసింది రాశారని విమర్శించారు. ఓ కట్టు కథనాన్ని ఎవరి ప్రయోజనం కోసమో వండి వార్చా డన్నారు . టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డ్ ఖరారు చేస్తుంది మంత్రికి సంబంధం ఉండదని తెలిపారు. తాను ఆత్మగౌరవం కోసం బతుకుతామని, దోపిడి దారుల నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులమంతా రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని చిల్లర కథనాలతో భయపెట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి గాలికి రాలేదని 40 సంవత్సరాలుగా సభలో ,బయట ఉండి ప్రజల కోసం పోరాటాలు చేసి వచ్చానన్నారు.

Next Story
Share it