ఓటములు సరే..గెలిచిన రాష్ట్రాలను పట్టించుకోరా!
కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ పోటీ చేసినా ఓటమినే చవిచూస్తోంది. అంతా కూడా హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని లెక్కలు వేసినా..చివరకు అక్కడ కూడా బొక్క బోర్లా పడింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ వ్యూహాల కంటే కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాధాలే ఎక్కువ అన్నది ఆ పార్టీ నాయకుల మాట. ఇన్ని పరాజయాల తర్వాత కూడా ఆ పార్టీ వైఖరిలో ఏ మాత్రం మార్పు వస్తున్నట్లు లేదు అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతోంది. కొత్తగా ఎన్నికల్లో గెలవలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గెలిచిన...అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా పార్టీ ని జాగ్రత్తగా చేసుకుంటుందా అంటే అదీ లేదు అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ వ్యవహారమే.
రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి పదేళ్ల తర్వాత ఛాన్స్ ఇచ్చారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుని..ఎంత పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్ళాలి. కానీ తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 13 నెలలు దాటినా కూడా పూర్తి స్థాయి మంత్రి వర్గం ఇప్పటి వరకు ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే గతంలో ఏ మాత్రం పాలనా అనుభవం లేదు. కానీ ఆయన సీఎం పోస్ట్ తో పాటు అత్యంత కీలక మైన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోమ్, విద్యా, కార్మిక, సంక్షేమ శాఖలను కూడా ఆయన చూస్తున్నారు. పలు జిల్లాలకు అసలు మంత్రి వర్గంలో ప్రతినిధ్యమే లేదు. రెండవ టర్మ్ సీఎం అయిన తర్వాత కెసిఆర్ కూడా కొన్ని నెలల పాటు మంత్రి వర్గం లేకుండానే పాలన సాగించారు. కాంగ్రెస్ హై కమాండ్ కూడా అధికారంలో ఉన్న కీలక రాష్ట్రం అయిన తెలంగాణ పై ఏ మాత్రం దృష్టి సారించకుండా కెసిఆర్ మోడల్ లోనే అంతా తమ ఇష్టం అన్న చందంగా వ్యవహరిస్తోంది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రి వర్గ విస్తరణపై అంత సీరియస్ గా ఉన్నట్లు కనిపించటం లేదు అనే అభిప్రాయం కొంత మంది కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
లేదు అంటే అధిష్టానంతో ఈ విషయంపై గట్టిగా మాట్లాడి ఫైనల్ చేసుకోవాలి కానీ...ఎప్పటికప్పుడు ఇలా సాగతీసుకుంటూ పోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. అదే సమయంలో అన్ని జిల్లాలకు మంత్రి వర్గంలో చోటు కల్పించకుండా రేపు స్థానిక సంస్ధ ఎన్నికల్లో ఎలా పోరాటం చేస్తారు అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఓడిపోయిన చోట్ల ఎలాగూ ఓడిపోతున్నారు కనీసం గెలిచిన చోట అయినా కూడా పక్కా ప్లానింగ్ తో ముందుకు పోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇలా చివరకు పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటు వంటి అంశాలపై కూడా ఫోకస్ పెట్టలేనంత బిజీగా ఏమి ఉంది అని ఒక నాయకుడు ప్రశ్నించారు. ఇన్ని చేదు ఫలితాలు చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో ఏ మాత్రం మార్పు కనిపిస్తున్న దాఖలాలు లేవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎన్నికల్లో గెలిచిన ఏడాది తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటు చేసుకోలేకపోవడం ఆయనకు కూడా మైనస్ గా మారే అంశమే. ఇప్పటికే పలు మార్లు ప్రతిపక్షాలు ఇదే అంశంపై విమర్శలు గుప్పించాయి కూడా.