Telugu Gateway
Telangana

హ్యాట్రిక్ గెలుపు ధీమా ఉంటే కెసిఆర్ రెండు చోట్ల పోటీ చేస్తారా?

హ్యాట్రిక్ గెలుపు ధీమా ఉంటే కెసిఆర్ రెండు చోట్ల పోటీ చేస్తారా?
X

బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్, బిఆర్ఎస్ మంత్రులు అంతా మాట్లాడితే హ్యాట్రిక్ విజయం ఖాయం అంటూ చెపుతున్నారు. గతం కంటే ఐదు లేదా ఆరు సీట్లు ఎక్కువే వస్తాయని ప్రకటిస్తున్నారు. నమ్మకం, ధీమా ఉండటంలో తప్పు లేదు. కానీ దేశంలో ఎక్కడా లేని పాలన అందించామని చెపుతున్న కెసిఆర్ మాత్రం ఒకటి కాదు..రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవటం పలు అనుమానాలకు..చర్చలకు కారణం అవుతోంది. సీఎం కెసిఆర్ తన నియోజకవర్గం గజ్వేల్ నుంచి మారతారని ప్రచారం చాలా కాలం నుంచి సాగుతుంది. అలా చేస్తే ఇక్కడ ఓడిపోతారు అనే భయంతోనే సీటు మార్చుకున్నారు అనే విమర్శలు వస్తాయని .. ఈ కొత్త ప్లాన్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అదే రెండు చోట్ల నుంచి పోటీ. ఇప్పుడు కెసిఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలవనున్నారు. కామారెడ్డి లో సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న గంప గోవర్ధన్ ను పక్కన పెట్టి మరీ కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకోవటం రాజకీయంగా అత్యంత కీలకం అనే చెప్పాలి. కామారెడ్డి ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు కోరినందుకే అక్కడ పోటీ చేస్తున్నట్లు కెసిఆర్ వెల్లడించారు.

కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ లాబీల్లో గంప గోవర్ధన్ తాను సీఎం ను మూడు సార్లు కలిసి అక్కడ పోటీ చేయమని కోరినట్లు వెల్లడించారు. తాజా సీట్ల ప్రకటనతో అంతా ఒక స్కెచ్ ప్రకారమే జరిగినట్లు స్పష్టం అవుతోంది. మీడియా సమావేశంలో రెండు చోట్ల ఎందుకు పోటీ చేస్తున్నారు అనే ప్రశ్న రాగా ...పార్టీ నిర్ణయించింది అని కెసిఆర్ చెప్పటం హైలైట్ గా చెప్పుకోవచ్చు. అధికార బిఆర్ ఎస్ పార్టీ లో అయినా...ప్రభుత్వం లో అయినా అంతా కెసిఆర్ అనే పేరున్న విషయం తెలిసిందే. అలాంటిది కెసిఆర్ ను రెండు చోట్ల పోటీ చేయమని పార్టీ డిసైడ్ చేసింది అని చెప్పటం అంటే వెరైటీ అని చెప్పుకోవచ్చు. సీటు మారారనే విమర్శలను తప్పించుకునే ప్రయత్నం చేసినా రెండు చోట్ల నుంచి పోటీ చేయటం అన్నది రాజకీయంగా మైనస్ పాయింట్ గా మారటం ఖాయం అనే చర్చ సాగుతోంది. కెసిఆర్ సోమవారం నాడు ఒకే సారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

Next Story
Share it