లింక్ ఎస్టాబ్లిష్ అయినట్లేనా?!
బిఆర్ఎస్ జమానాలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం కూడా డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాము అని కొన్ని రోజులు హంగామా చేసింది. కానీ ఫలితం శూన్యం. మరో వైపు టాలీవుడ్ కు చెందిన ఎంతో మంది పై కేసులు పెట్టారు..కొన్ని రోజులు హడావుడి చేసి..తర్వాత అంతా వదిలేశారు. అప్పటిలో రాజకీయంగా కూడా డ్రగ్స్ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరిగింది. ప్రధానంగా అప్పటి టీపీసీసీ ప్రెసిండెంట్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఎన్నో విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతామని సీఎం చెపుతున్నా..అది ఇంకా కట్టడిలోకి రాలేదు అనే చెప్పొచ్చు. ఇప్పటికీ పలు పబ్ ల్లో అప్పుడప్పుడు డ్రగ్స్ పార్టీ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కేసులు కూడా నమోదు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గతంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఆయన బావమరిది రాజ్ పాకాల పై కూడా విమర్శలు చాలానే చేశారు. కేటీఆర్ అయితే కోర్టు ను ఆశ్రయించి మరీ తనపై ఎలాంటి ఆరోపణలు చేయకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఇప్పుడు తాజాగా రాజ్ పాకాల నిర్వహించిన పార్టీ లో విజయ్ మద్దూరి అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ అయింది. దీంతో గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు కొంత బలం చేకూరినట్లు అయింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటివరకు కేవలం ఆరోపణల వరకే ఉన్న అంశం రాజ్ పాకాల ఇచ్చిన పార్టీ లో ఒక వ్యక్తి డ్రగ్స్ ఆనవాళ్లతో దొరకటం బిఆర్ఎస్ ను ఇరకాటంలో పడేసింది అనే చెప్పాలి. మరో వైపు మీడియా సాక్షిగా ఆ పార్టీ జరిగిన ప్రాంతంలో కేసినో ల్లో ఉపయోగించే కాయిన్స్ తో పాటు మరికొన్ని కార్డ్స్ కూడా దొరికాయి.బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఇది పూర్తి ఫ్యామిలీ పార్టీ మాత్రమే అని చెపుతున్నారు. కాసేపు అదే నిజం అనుకుందాం...గృహ ప్రవేశ పార్టీ ల్లో కేసినో కాయిన్స్ ఎందుకు ఉన్నట్లు?. ఇండియా లోనే అసలు కేసినో లకు ఒక్క గోవా లో తప్ప ఎక్కడా అనుమతి లేదు అనే విషయం తెలిసిందే.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే మరి రాజ్ పాకాల నూతన గృహ ప్రవేశ పార్టీ అయితే దీనికి మాజీ మంత్రి కేటీఆర్ ను..ఆయన కుటుంబ సభ్యులను ఎందుకు పిలవలేదు అన్న ప్రశ్న ఉదయించకమానదు. కెటిఆర్ అయితే తాను మాత్రం అసలు అటు వైపు వెళ్లకపోయినా కొంత మంది మీడియా లో ఇష్ఠానుసారం చెపుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ పాకాల ఇచ్చిన తాజా పార్టీ కి..గతం లో ఆయన పై వచ్చిన ఆరోపణలకు కొంత లింక్ మాత్రం ఎస్టాబ్లిష్ అయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి కాంగ్రెస్ సర్కారు ఈ కేసు ను ఎంత పర్ఫెక్ట్ గా డీల్ చేస్తుందో చూడాల్సిందే. జన్వాడ లో జరిగింది కేవలం ఫ్యామిలీ పార్టీ నే అని కేటీఆర్ గట్టిగా చెపుతున్నారు. నిజంగా అక్కడ కేవలం ఫ్యామిలీ పార్టీ నే జరిగి ఉంటే రాజ్ పాకాల పోలీస్ లకు అదే విషయం చెపితే సరిపోయేది. మరి ఎందుకు ఆయన పరారీలో ఉన్నాడు అన్న ప్రశ్న రాక మానదు. కేవలం లిక్కర్ బాటిల్స్ కేసు అయితే అది పెద్ద విషయం కాదు అనే వాళ్లే చెపుతున్నారు. ఎక్సైజ్ అధికారులు ఫార్మ్ హౌస్ లో విదేశీ మద్యం, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన మద్యం మాత్రమే దొరికింది అని చెప్పిన మాట నిజమే. మరి కనిపించకుండా పోయిన వాళ్ళ దగ్గర ఏమి ఉందో ఎవరికీ తెలియాలి.