జాతీయ స్థాయిలో కెసీఆర్ తో కలిసొచ్చేదెవరు?!
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో సక్సెస్ అంత ఈజీగా సాధ్యం అవుతుందా?. ఆయనతో అసలు జాతీయ స్థాయిలో కలిసొచ్చేది ఎవరు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. దసరా ముహుర్తంగా ఆయన జాతీయ పార్టీ ప్రకటిస్తారని వార్తలు వస్తున్న తరుణంలో జాతీయ స్థాయిలో కెసీఆర్ తో కలసి వచ్చేది ఎవరు అన్న చర్చ ప్రారంభం అయింది. ఇప్పటికే ఎవరు ఎవరితో ముందుకు సాగాలో చాలా వరకూ ఫిక్స్ అయ్యారు. మరి ఈ తరుణంలో కెసీఆర్ తో జట్టు కట్టేది ఎవరు...కీలక పార్టీలు ఏవీ తోడు రాకుండా కెసీఆర్ సొంతంగా ఓ జాతీయ పార్టీ పెట్టి..ఎంపిక చేసిన రాష్ట్రాల్లో పోటీ చేస్తే దాని వల్ల ఫలితం ఉంటుందా అన్న చర్చ కూడా ప్రారంభం అయింది. కొద్ది రోజుల క్రితమే సీఎం కెసీఆర్ బీహార్ లో పర్యటించారు..సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నితీష్ కుమార్..ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ లు కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతో భేటీ అయ్యారు. అంతే కాదు.తర్వాత ఆయన స్వయంగా థర్డ్ ఫ్రంట్ ఏమీ ఉండదని..కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు కలసి ముందుకు సాగితేనే వచ్చే 2024 ఎన్నికల్లో బిజెపిని ఓడించటం సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.
బీహార్ లో ఆర్జేడీ, జెడీయూ, తమిళనాడులో డీఎంకె, మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన వంటి కీలక పార్టీలు అన్నీ కాంగ్రెస్ తో సాగేందుకే మొగ్గుచూపుతాయి. ఉత్తరప్రదేశ్ కు చెందిన అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం తటస్థంగా ఉన్నా ఆయన కూడా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం కాంగ్రెస్, బిజెపిలతో కలవం అని చెబుతున్నారు ప్రస్తుతానికి అయితే. కొత్తగా జాతీయ పార్టీ పెట్టబోతున్న కెసీఆర్ జాతీయ స్థాయిలో ఏ మేరకు సత్తా చాటుతారు అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కేవలం ఏజెండా చూసి ఇతర రాష్ట్రాల్లో ఓట్లు వేయటం అంటే అది జరిగే పని కాదు అన్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎప్పుడు ఏ వైఖరి తీసుకుంటారో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. కమ్యూనిస్టులు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వైపు ఉండటానికే మొగ్గుచూపుతారు. తెలంగాణలో కమ్యూనిస్టులు ప్రస్తుతానికి కెసీఆర్ వైపు ఉన్నా జాతీయ స్థాయి విషయానికి వచ్చేసరికి వారి ఛాయిస్ కాంగ్రెస్ వైపే ఉంటుంది..అయినా ఇప్పుడు వారి పాత్ర చాలా పరిమితం అయిపోయిందనే విషయం తెలిసిందే. ఇవన్నీ చూస్తే కెసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిపోతారా...ఎవరైనా జత కలుస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. కర్ణాటకకు చెందిన మాజీ సీఎం కుమారస్వామి కెసీఆర్ తో భేటీ అయినా ఆయన పాత్ర చాలా పరిమితమే అని చెప్పుకోవచ్చు.