Telugu Gateway
Telangana

రేవంత్ సర్కారు అక్కడ వరకూ వెళుతుందా?

రేవంత్ సర్కారు అక్కడ వరకూ వెళుతుందా?
X

గత బిఆర్ఎస్ పాలనలో వ్యవస్థలు అన్ని "కేంద్రీకృతం" గానే సాగిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో ఏమి జరగాలన్నా ఆ ఇద్దరి ఆమోదం లేకుండా ముందుకు కదిలిన దాఖలాలు లేవు. శాఖలు అన్నింటిలోనూ అదే పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అని చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో కీలక స్థానంలో చక్రం తిప్పిన అధికారి శివ బాలకృష్ణ ఏసీబీ కి సంచలన విషయాలు వెల్లడించినట్లు కనిపిస్తోంది. అయన అక్రమ ఆస్తులు అన్ని కలిపితే మార్కెట్ విలువ ప్రకారం వెయ్యి కోట్ల రూపాయల పైమాటగానే చెపుతున్నారు. వందల ఎకరాల భూములతో పాటు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఆస్తులు కూడా అయన, అయన బినామీల పేర్ల మీద గుర్తించారు. అంతే కాదు...ఏసీబీ కస్టడీలో శివ బాలకృష్ణ గత ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు చెప్పటం ఇప్పుడు తెలంగాణలోని ఐఏఎస్ అధికారులతో పాటు ప్రభుత్వ వర్గాల్లో కూడా పెద్ద సంచలనంగా మారింది. అయన చెప్పినట్లు చేశానని...అలాగే ఇందులో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా బాల కృష్ణ పూర్తి వివరాలు వెల్లడించినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. గత ప్రభుత్వం ...ప్రభుత్వ పెద్దలు పాలన కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికి తెలిసిందే. అంతే కాదు...కీలక నేతలు హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో వాటాలు తీసుకున్నారు అనే ప్రచారం బలం గా ఉన్న విషయం తెలిసిందే.

అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడటం మాత్రమే కాదు..వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కూడా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీల పరం అయ్యేలా సాయం చేసి అందులో భారీ ఎత్తున ప్రయోజనం పొందినట్లు అధికారులు చెపుతున్నారు. అనుమతుల్లో అవినీతి ఒక పెద్ద ఇష్యూ అయితే...ప్రభుత్వ భూములను..వివాదాస్పద భూములను తమకు బాగా కావాల్సిన వారికి కట్టబెట్టి వందల కోట్లు వెనకేసుకున్నారు అని చెపుతున్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయాలు అన్ని తవ్వు తుందా...తవ్వినా కూడా ఇందులో కీలక సూత్రధారులు..పాత్రధారులను కలుగులోనుంచి బయటకు ఎంతవరకు తెస్తుందో చూడాలి. శివ బాలకృష్ణ చెప్పినట్లు ఐఏఎస్ అధికారి అవినీతి డబ్బులు తీసుకున్నా కూడా అయన సొంతంగా అంత సాహసం చేసే అవకాశం ఉండదు అని...అంతా పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే సాగి ఉంటుంది అన్నది అప్పటి వ్యవహారాలను దగ్గర నుంచి చూసిన అధికారులు చెపుతున్న మాట. శివ బాలకృష్ణ టూ ఐఏఎస్ అరవింద్ కుమార్ ...ఆ పై లింక్ లను కూడా ఎస్టాబ్లిష్ చేస్తే కళ్ళు చెదిరే విషయాలు బయటకు వస్తాయన్నది అధికారులు చెపుతున్న మాట. అధికారంలో ఉన్నంత కాలం మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ దరఖాస్తు చేసుకుంటే చాలు ఆటోమేటిక్ గా అనుమతులు మంజూరు చేసినట్లు ప్రచారం చేసుకున్నారు. నిజంగా ఆలా జరిగి ఉంటే ఒక అధికారి బాలకృష్ణ దగ్గర ఇంత అవినీతి సొమ్ము ఎలా దొరుకుతుందో ఆయనే చెప్పాలి.

Next Story
Share it