టీఆర్ఎస్ టీమ్ లోకి విహెచ్ ను ఎవరు అనుమతించారు?!

రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత ఎవరైనా వస్తుంటే ఆయన స్వాగతానికి ఎవరెవరిని అనుమతించాలో ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారు. ప్రధాని లాంటి వ్యక్తి వస్తే ప్రొటోకాల్ ప్రకారం అంతా జరిగిపోతుంది. పార్టీ సమావేశాలకు వస్తే..అది పార్టీ నాయకుల జాబితా మేరకు ఆయా నాయకులను అనుమతిస్తారు. మరి విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటనలో..ముఖ్యమంత్రి కెసీఆర్..టీఆర్ఎస్ మంత్రుల..ఎంపీలు..ఎమ్మెల్యేలతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కు ఛాన్స్ ఎలా దక్కింది. అధికార టీఆర్ఎస్ ఆమోదం లేకుండా ఇది సాధ్యం అవుతుందా?. అంటే ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు. ఇదొక్కటే కాదు..అసలు విహెచ్ కు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటే లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏ సభలోనూ సభ్యుడు కాదు కాబట్టి. ఇవన్నీ ఒకెత్తు అయితే తెలంగాణ తెకాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి యశ్వంత్ సిన్హా నేరుగా టీఆర్ఎస్ నేతలను కలుస్తున్నందున హైదరాబాద్ లో తాము ఎవరూ కూడా ఆయన్ను కలవం అని ప్రకటించారు.
అయినా సరే విహెచ్ బేగంపేట విమానాశ్రయానికి ఎలా వెళ్లారు. ఆయనకు టీఆర్ఎస్ టీమ్ తో పాటు ఎవరు?..ఎందుకు అనుమతించారు. దీని వెనక ఎవరు ఉన్నారు అన్న చర్చ సాగుతోంది. రేవంత్ ప్రకటన తర్వాత కావాలనే కొంత మంది ఆయన్ను బేగంపేట విమానాశ్రయానికి పంపించారని ఆ పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై రేవంత్ రెడ్డి కోపం నోరు జారారు. ఇదే ఇప్పుడు ఆస్త్రంగా సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది అంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే..వ్యూహాత్మకంగానే సాగుతుందని..అయితే ఈ ట్రాప్ లో రేవంత్ రెడ్డి పడ్డారని అంటున్నారు. ఈ వ్యవహారం వెనక ఎవరు ఉండి నడిపిస్తున్నారో ఊహించటం పెద్ద కష్టం కాదని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.