పేలని బాంబులు!
తెలంగాణ సర్కారు లోని కీలక మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒకరు. తొలి సారి మంత్రి అయినా ప్రభుత్వం లో ఆయన హవా బాగానే సాగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.ఆయన తనకున్న ఆర్థిక వనరులతో ఇప్పటికిప్పుడు కాకపోయినా కీలక పదవే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. దీనికి అవసరం అయిన తెరవెనక ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు అని..దీని కోసం కింది స్థాయి నుంచి అంతా ఒక ప్లాన్ ప్రకారం గ్రూప్ ను సిద్ధం చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు కూడా చెపుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యలు ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులు, మీడియా టీం తో కలిసి దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో పర్యటించారు. మూసీ పునర్జీవ ప్రాజెక్ట్ లో భాగంగా హన్ నది పునరుజ్జీవ ప్రాజెక్ట్ ను పరిశీలించి వచ్చి...ఆ మోడల్ ను ఇక్కడ అమలు చేయాలి అన్నది ప్రభుత్వ ప్లాన్.
ఈ పని మీద సియోల్ వెళ్లిన పొంగులేటి అక్కడ మీడియా తో మాట్లాడుతూ సియోల్ లో పర్యటిస్తున్న టీం హైదరాబాద్ లో అడుగుపెట్టేలోపు రాజకీయ బాంబు లు పేలతాయన్నారు. మరో సారి దీపావళి కంటే ఇవి ముందే పేలటం పక్కా...దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయని తేల్చిచెప్పారు. సియోల్ నుంచి టీం వెనక్కి వచ్చి ఐదు రోజులు కావస్తోంది ...దీపావళి కి ఇంకా కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా లేదు. కానీ ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పిన రాజకీయ బాంబుల జాడ లేదు. మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం తనకు ఏమీ తెలియదు అని...తాము అన్ని విచారణలకు సంబంధించిన నివేదికలు వచ్చిన తర్వాతే ఏ విషయంలో అయినా నిబంధనల ప్రకారమే వెళతామని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన కొత్తలో మున్సిపల్ శాఖలో సాగిన ఈ ఫార్ములా అక్రమ చెల్లింపుల విషయంలో హంగామా చేసిన ప్రభుత్వం తర్వాత ఆ సంగతి మర్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ వ్యవహారంలో కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి తన పరువు తానే తీసుకున్నారు అనే చర్చ అటు రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది. అసలు వెళ్లిన పని ఒకటి...అక్కడ మీడియా ఉంది కదా అని చెప్పింది ఒకటి. అయినా ఆయన చెప్పినట్లు ఇప్పటి వరకు ఏమీ జరగకపోవటంతో ఆ ప్రభావం భవిష్యత్ లో ఆయన చెప్పే మాటలపై పడుతుంది అనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు పొంగులేటి బాంబు ల వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తున్న విషయం తెలిసిందే. మరి పొంగులేటి చెప్పిన రాజకీయ బాంబు లు ఎప్పుడు పేలతాయో వేచిచూడాల్సిందే.