Telugu Gateway
Telangana

రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి ఫైర్

రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ రెడ్డి ఫైర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ...తన నియోజకవర్గం మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతే కాదు..సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా నువ్వేమి ముఖ్యమంత్రివి...నీదేమీ భాష అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ కు పది వేల కోట్ల రూపాయలు తీసుకెళ్లారు అని...తమ నియోజకవర్గానికి నిధులు అడిగితే మాత్రం పండబెట్టి తొక్కుతా అంటూ వ్యాఖ్యలు చేయటం ఏమిటి అంటూ ప్రశ్నించారు. మీరే పదవుల్లో ఉండండి అంటూ సీఎం ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. నిధులు అన్నీ కొడంగల్...మధిర..ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గాలకు వెళుతున్నాయి అని..తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కొండంగల్ కు పది వేల కోట్ల రూపాయలు కాకపోతే 20 వేల కోట్ల రూపాయలు తీసుకుపో...కానీ ఒక సీనియర్ శాసనసభ్యుడు వెనకబడిన నియోజకవర్గం కోసం నిధులు అడిగితే పాజిటివ్ గా స్పందించాల్సింది పోయి ఇలాగేనా మాట్లేది అంటూ ప్రశ్నించారు. నీకు అదృష్టం కలిసి వచ్చింది ..ముఖ్యమంత్రి అయినవు. ఇంకా రెండేళ్లు కూడా మంచిగా ఉండు అన్నారు.

కొడంగల్ తో పాటు వెనకబడిన నియోజకవర్గాలు కూడా చూసుకో అంటూ సీఎం రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం పై రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా కామెంట్స్ చేయటం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఆయన సీఎం ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి లేకుండా ఎవరూ పని చేయటం లేదు అని ఆరోపించారు. రోడ్ కాంట్రాక్టు ల తో పాటు ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా ఆయన గతంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు...ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు కేటాయిస్తున్నారు అని విమర్శలు గుప్పించారు. ఒక వైపు బిఆర్ఎస్ నేతలు ఇప్పటికే అవినీతికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తుంటే...సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా అదే తరహా వ్యాఖ్యలు చేయటంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Next Story
Share it