Telugu Gateway
Telangana

కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం

కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం
X

మోడీ చెప్పినా ఆపేంత శక్తి కిషన్ రెడ్డి కి ఉందా!

ప్రధాని మోడీ పేరు చెపితే కాంగ్రెస్ అధిష్టానం మండిపడుతుంది. దీనికి ఎన్నో కారణాలు. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా మోడీ ముప్పు తిప్పలు పెట్టడంతో పాటు ప్రతి ఎన్నిక సమయంలో ఆ పార్టీని చావుదెబ్బతీయటానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. అలాంటి ప్రధాని నరేంద్ర మోడీ పై తెలంగాణ ముఖ్యమంత్రి ఆదివారం నాడు బహిరంగ వేదికపై ప్రశంసలు కురిపించటం కొంత మంది మంత్రులకే కాకుండా..కాంగ్రెస్ నేతలను షాక్ కు గురిచేసింది అనే చెప్పొచ్చు. ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా తెలంగాణ కు ఎలాంటి ప్రాజెక్ట్ లు కేటాయించలేదు..ప్రత్యేకంగా ఎలాంటి వెసులుబాట్లు ఇవ్వలేదు. ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా మీడియా సమావేశాలు పెట్టి నిరసనలు తెలిపారు. తెలంగాణపై మోడీ సర్కారు వివక్ష చూపిస్తోంది అని రేవంత్ రెడ్డి నిన్న మొన్నటి వరకు ఆరోపిస్తూ వచ్చారు. కానీ ఆయన ఆదివారం నాడు బహిరంగ సభ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం షాకింగ్ గానే ఉన్నాయని చెప్పాలి.

‘మనకు సమస్య మోడీ కాదు. ప్రధాని మోడీ తెలంగాణ పట్ల సానుభూతి తో ఉన్నా ..కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు. ఆయన చీకటి మిత్రుడు కెసిఆర్ ఓడిపోయాడు అన్న దుఃఖంలో ఉన్నాడు. పాపం మోడీ మంచిగానే ఉన్నారు. మనకు ఏదైనా చేయాలని . సైంధవుడి పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తున్నాడు. సమస్య అక్కడ లేదు ..ఇక్కడే. అంటే తెలంగాణకు సమస్య మోడీ కాదు కిషన్ రెడ్డి అన్న చందంగా’ రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ మాటలే చాలా మందిని ఆశ్చర్యానికి, షాక్ కు గురి చేశాయి. అసలు ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ మాటలు అన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి ఏమైనా సంకేతాలు పంపాలనుకున్నారా?. తనకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు వేరే ఆప్షన్ కూడా ఉంది అనే సంకేతం ఇవ్వటం కోసమే ఈ మాటలు చెప్పారా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ నేతల్లో సాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎం ఛాన్స్ ఇచ్చినా కూడా పరిపాలనలో ఆయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు అని...ఈ కారణంగానే ఎన్నో సమస్యలు వస్తున్నాయి అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో ఉంది.

ఈ విషయం కాసేపు పక్కనపెడితే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఏ మాత్రం నమ్మశక్యంగా లేవు అన్నది ఎక్కువ మంది భావన. తెలంగాణకు ప్రధాని మోడీ నిజంగా ఏదైనా చేయాలనుకుంటే ఆపే అంత శక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఉందా?. కేంద్ర కేబినెట్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మోడీ కి ఎదురు చెప్పే పరిస్థితి లేదు అన్నది బీజేపీ వ్యవహారాలను దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు చెపుతున్న మాట. అలాంటిది మోడీ తెలంగాణ కు ఏదో ఒకటి చేయాలని చూస్తుంటే కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నారు అంటే నమ్మటం కష్టమే అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో కూడా ఉంది. కిషన్ రెడ్డి ప్రత్యేకంగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రాజెక్టు ల విషయంలో ఎలాంటి కృషి చేయటం లేదు అంటే కొంత కొంతలో ఒక రకంగా ఉండేది. కానీ అలా కాకుండా మోడీ ఏదో చేద్దాం అనుకుంటుంటే కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పటం చాలా మందిని ఆశ్చర్యపరిచిన అంశం. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లోని కొంత మంది నేతలు బీజేపీ అధిష్ఠానం తో సన్నిహితంగా ఉంటున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో మోడీ మంచోడే కానీ..కిషన్ రెడ్డి తోనే సమస్య అన్న చందంగా రేవంత్ రెడ్డి చెప్పటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story
Share it