Telugu Gateway
Telangana

కేటీఆర్ కోసం మోడీ ఆశీస్సులు కోరింది నిజమే

కేటీఆర్ కోసం మోడీ ఆశీస్సులు కోరింది నిజమే
X

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత సీఎం హామీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు అని కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కెసిఆర్ ఇండియా టుడే కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కెసిఆర్ కు ఇదే ప్రశ్న ఎదురైతే అయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది అనే చెప్పాలి. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మాకు కేవలం 63 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆ సమయంలో కొత్త రాష్ట్రాన్ని వేరే వాళ్ళు నడిపించటం కష్టం అని సలహా ఇచ్చారు. అవును..దళిత ముఖ్యమంత్రి విషయంలో నేను హామీ ఇచ్చాను. ఇచ్చిన మాటపై మేం వెనక్కి తగ్గలేదు. దానికి సమయం రానివ్వండి అంటూ కెసిఆర్ వ్యాఖ్యానించటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. ఇదే ఇంటర్వ్యూ లో కెసిఆర్ ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ బహిర్గతం చేసిన సంచలన విషయాలపై కూడా స్పందించారు. ఎన్ డీఏ లో చేరాల్సిందిగా మోడీ కోరితే...ముందు తెలంగాణ కు ఏదైనా మేలు చేయాలని..తర్వాత చూద్దాం అని చెప్పినట్లు వెల్లడించారు. అదే సమయంలో కెటిఆర్ ను సీఎం చేసే విషయంలో జరిగిన మాటల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది.

దీనిపై కెసిఆర్ స్పందిస్తూ ‘50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నందున 70 ఏళ్లు వచ్చే సరికి రిటైర్మెంట్‌ గురించి ఆలోచించవచ్చని ప్రైవేట్‌గా మాట్లాడితే, దాన్ని ప్రజలకు వెల్లడించాలా? కేటీఆర్ గురించి మోడీ నే ఆరా తీశారు. ఆ సమయంలోనే మీరు ప్రధానమంత్రి అయినందున, మీ ఆశీస్సులు అందజేయండి, అతనికి సహకరించండి అని మోడీ ని కోరాను. ఇలాంటి వ్యక్తిగత సంభాషణలను రాజకీయ వేదికపై వెల్లడించడం ప్రధానికి తగునా? అంటూ మోడీ తీరును కెసిఆర్ తప్పుపట్టారు. నిజమాబాద్ సభలో మోడీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపగా కెసిఆర్ తనయుడు...మంత్రి కేటీఆర్ ఇది అంతా తప్పు...తాను సీఎం కావటానికి....మోడీ అనుమతి అవసరమా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు స్వయంగా కెసిఅర్ ఈ విషయాలు నిజం అని చెప్పటంతో వీళ్ళు ఏ విషయంలో కూడా నిజం చెప్పరేమో అనే అనుమానాలు రావటం సహజం. ఈ ఇంటర్వ్యూ లో కెసిఆర్ కేంద్రంలోని కేంద్రంలో మోడీ పాలన వంద శాతం దారుణంగా ఉంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయన పాలన లోనే రూపాయి కొత్త కనిష్ట స్థాయికి పడిపోయింది అని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇందులోని అంశాలు దుమారం రేపటం ఖాయంగా కనిపిస్తున్నాయి.

Next Story
Share it