కేంద్రంపై యుద్ధం ఆగదు
హైదరాబాద్ లోని ఇందిరాపార్కు సమీపంలో ధర్నాచౌక్ లో ముఖ్యమంత్రి కెసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహా ధర్నాచేశారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్ళలో వివక్ష చూపిస్తోందని ముఖ్యమంత్రి కెసీఆర్ విమర్శించారు. పంజాబ్ లో కొన్నట్లుగానే తెలంగాణలో కూడా ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం రైతులు..వ్యవసాయం పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని..అంతం కాదన్నారు. ఈ యుధ్ధం ఇప్పుడే మొదలైందని అన్నారు. ఈ పోరాటాన్ని భవిష్యత్ లో మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పోరాటం ఢిల్లీ వరకూ చేస్తామన్నారు. కేంద్రం కళ్ళు తెరిపించటానికే ఈ యుద్దం అన్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులే ధర్నాలు చేస్తారా అని కొంత మంది మాట్లాడుతున్నారని..2006లో అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోడీ కూడా ధర్నా చేశారని..ఇది రికార్డుల్లో ఉందన్నారు. రైతుల కోసం ఏమైనా చేస్తామని..వారి కోసం పోరాటం చేస్తామన్నారు. మహాధర్నా తరువాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి సీఎం కేసీఆర్ వినతి పత్రం ఇవ్వనున్నారు. ధర్నా చౌక్ నుంచి పాదయాత్ర ద్వారా రాజ్ భవన్ కు వెళ్ళాలనే యోచనలో ఉన్నారు కెసీఆర్. కేంద్ర మంత్రిని కలసి 50 రోజులు గడిచిన కేంద్ర నుంచి ఎలాంటి స్పందన లేదని కెసీఆర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రధానికి లేఖలు కూడా రాశామని.. గ్రామగ్రామల్లో వివిధ రకాల ఆందోళనలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు.