ఎంజీఎం ఆస్పత్రిలో పేషంట్ ను కొరికన ఎలుకలు

సేమ్ టూ సేమ్. ఒకప్పుడు చంద్రబాబు హయాంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న చిన్నారిని ఎలుకలు కొరికాయి. దీంతో ఈ బాలుడి చికిత్స పొందుతూ మరణించాడు.అయితే ఇప్పుడు అదే తరహా ఘటన వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో జరిగింది. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ఎంజీఎంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న పేషంట్‌పై ఎలుకలు దాడి చేశాయి. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న భీమారంకు చెందిన పేషంట్ శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేసి ఐదు చోట్ల కొరికాయి. కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కావడంతో పేషంట్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న అడిషనల్ కలెక్టర్ శ్రీవాత్సవ ఆస్పత్రిని సందర్శించి ఎలుకల బెడదకు గల కారణాలపై ఆరా తీశారు.
అదే సమయంలో ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి.. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైనేజీ, పారిశుద్ద్య పనులను మెరుగుపర్చాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పేషంట్‌ను ఎలుకలు తీవ్రంగా గాయపరిచిన ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. ఇప్పటికే అడిషనల్ కలెక్టర్ వార్డును పరిశీలించారు. సాయంత్రంలోగా నివేదిక వచ్చే అవకాశం ఉంది.



