Telugu Gateway
Telangana

వైజాగ్ స్టీల్...బెడిసికొడుతున్న బిఆర్ఎస్ వ్యూహం!

వైజాగ్ స్టీల్...బెడిసికొడుతున్న బిఆర్ఎస్ వ్యూహం!
X

మాటలు మార్చటంలో బిఆర్ఎస్ నేతలు కెసిఆర్, కెటిఆర్ ల తీరుపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తోంది. అయితే ఇది అంతా గాలి మాటలుగా కాకుండా .. పక్కా ఆధారాలతోనే చేస్తున్నారు సుమా. ప్రాంతీయవాదంతో పార్టీ పెట్టి రాజకీయంగా లబ్ధిపొందిన కెసిఆర్..ఇప్పుడు రెండు సార్లు తెలంగాణ లో అధికారం చెలాయించిన తర్వాత అయన కన్ను దేశంపై పడింది. అందుకు ఒకప్పుడు ఆంధ్రా లో ఉన్న వాళ్ళు అంతా రాక్షసులే అంటూ విమర్శించిన కెసిఆర్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తాం..దీని ప్రైవేటీకరణ కాకుండా ఆపుతాం అని చెపుతున్నారు. తెలంగాలో బిఆర్ఎస్ ఇచ్చిన ఇలాంటి హామీలు చాలానే ఉన్నాయి. కానీ అధికారం కట్టబెట్టిన వాళ్ళను వదిలేసి...ఆంధ్ర ప్రదేశ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వైపు ఫోకస్ పెట్టారు అంటే ఇందులో రాజకీయ ప్రయాజనాలు ..లేదంటే ఆర్థిక ప్రయాజనాలు ఉండి ఉంటాయనే చర్చ సాగుతోంది. నిన్నటి నుంచి సోషల్ మీడియా లో ఒక పాత వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆంధ్ర ప్రదేశ్ పై ఎక్కడలేని ప్రేమ కురిపిస్తూ ఎక్కడో ఉన్న బైలదిల్లా ఐరన్ ఒర్ గనులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు...బయ్యారం స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలి అని కోరుతున్నారు. అదేమీ తప్పు కాదు. ఇదే కెటిఆర్ అప్పటిలో బయ్యారంలో ఉన్న ఐరన్ ఒర్ ను వైజాగ్ స్టీల్ కు కేటాయించాలనే ప్రతిపాదన వస్తే మాత్రం ఏమి అన్నారంటే....కృష్ణా, గోదావరి బేసిన్ లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ను తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులకు ఇవ్వని సర్కారు..ఇక్కడి సంపదను దోచుకుంటుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో నల్గొండలో అప్పట్లో కోటి సంతకాలు సేకరించారు. పిడికెడు ఉక్కును కూడా వైజాగ్ కు తరలించనించే ప్రసక్తి లేదు అని అప్పటిలో కెటిఆర్ ప్రకటించారు.

ఇప్పుడు ఆయనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతాం అంటూ ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారు. భూమి, ఆకాశం ఏకం చేసి అయినా సరే బయ్యారం ఐరన్ ఒర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు పోనివ్వం అని ప్రకటించారు. బయ్యారం ప్రాంతంలోనే తెలంగాణ స్టిల్స్ పేరుతో ఫ్యాక్టరీ నెలకొల్పే వరకు...ఈ ప్రాంత బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. పోరాటం సంగతి పక్కన పెట్టి అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఈ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అంటూ నినదించి ..ఇప్పుడు మాత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడతాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ విషయంలో అన్ని పార్టీలు అధికార బిఆర్ఎస్ పై ఎటాక్ చేస్తుండటంతో ఆ పార్టీ వ్యూహం దెబ్బతిన్నట్లు అయింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అదే సమయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మంత్రులు అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ..ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్రం పెట్టిన నిబంధలు ప్రకారం ఈఓఐ లో పాల్గొనే అవకాశం లేదు అని..ఇది అంతా రాజకీయ డ్రామా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో బిఆర్ఎస్ మరింత ఇరకాటంలో పడినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. మాటలు మార్చటంలో ....తమ రాజకీయ అవసరాల కోసం మాట తిప్పటంలో కెసిఆర్, కెటిఆర్ ఒకరిపై ఒకరు పోటీలు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

(కెటిఆర్ పాత వీడియో పైన ఐటెం లో చూడ వచ్చు)

Next Story
Share it