Telugu Gateway
Telangana

ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ కు తుమ్మల నరేంద్రచౌదరి

ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ కు తుమ్మల నరేంద్రచౌదరి
X

పాస్ పోర్టుల సరెండర్ కు ఆదేశం

అరెస్ట్ వద్దని హైకోర్టు ఆదేశం

జూబ్లిహిల్స్ సొసైటీ మాజీ అధ్యక్షుడు తుమ్మల నరేంద్ర చౌదరికి కొంత ఊరట. అరెస్ట్ నుంచి మినహాయింపు దొరికింది. ఆయనకు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో పలు షరతులు పెట్టింది. జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోని నలభై కోట్ల రూపాయల విలువ చేసే ఫ్లాట్ ను కేవలం రెండు లక్షల రూపాయలకే అక్రమంగా రిజిస్టర్ చేశారనే అంశంపై నమోదు అయిన కేసులో నరేంద్రచౌదరి ఏ1గా ఉన్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు గత కమిటీలోని సభ్యులపై కూడా కేసు నమోదు అయింది. అయితే అరెస్ట్ కాకుండా ఉండేందుకు ఆయన కోర్టును ఆశ్రయించి ఊరట పొందారు. లక్ష రూపాయల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించటంతోపాటు విదేశాలకు వెళ్లకుండా వీరు తమ పాస్ పోర్టులను ట్రయల్ కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. ఈ భూమి కేసు నమోదు అయిన పోలీస్ స్టేషన్ లో ప్రతి శనివారం హాజరు కావాలని ఆదేశించారు.

హైకోర్టు న్యాయమూర్తి గండికోట శ్రీదేవి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. అమెరికాలో ఉన్న శిరీష సంతకాలను ఫోర్జరీ చేస్తూ అక్రమ డాక్యుమెంట్లతో గత పాలక మండలి మోసానికి పాల్పడిందని వీరిపై కేసు నమోదు అయింది. సొసైటీ నూతన పాలక వర్గం ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించిన తర్వాతే జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. సొసైటీ తరపున హాజరైన అడ్వకేట్ తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సొసైటీలో జరిగింది 40 కోట్ల రూపాయల స్కామ్ అని..మోసం అని..ఇలాంటి కేసుల్లో అరెస్ట్ కాకుండా బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేసిన వారి తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు విన్పించారు. నిందితులు విచారణకు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు.

Next Story
Share it