తుమ్మల నరేంద్రచౌదరి అరెస్ట్ వద్దు
జూబ్లిహిల్స్ హౌసొంగ్ సొసైటీలో అక్రమాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తుమ్మల నరేంద్ర చౌదరికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై ఇటీవలే జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. ఫోర్జరీ ఆరోపణలతోపాటు మోసపూరిత పద్దతుల ద్వారా జూబ్లిహిల్స్ సొసైటీ పరిధిలోని 1500 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో పలు ఆధారాలతో బి.రవీంద్రనాథ్ ఫిర్యాదు చేశారు. ఆధారాలు సమర్పించినా పోలీసులు చాలా కాలం కేసు నమోదు చేయకపోవటంతో ఇటీవలే సొసైటీ తరపున హైకోర్టును ఆశ్రయించారు.
ఆ తర్వాతే జూబ్లిహిల్స్ పోలీసులు నరేంద్రచౌదరి ఏ1గా, ఇతర సభ్యులపై కూడా ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే తుమ్మల నరేంద్ర చౌదరిని యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి జి. శ్రీదేవి ఈ ఈ కేసును మొదటి వెకేషన్ కోర్టు ముందు పోస్ట్ చేయాలని ఆదేశించారు. అప్పటివరకూ పిటీషనర్ తుమ్మల నరేంద్ర చౌదరిని క్రైమ్ నెంబర్ 237 ఆఫ్2021లో అరెస్ట్ చేయవద్దని మంగళవారం నాడు ఆదేశించారు. దీంతో జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసులో చౌదరికి తాత్కాలిక ఊరట లబించినట్లు అయింది.