Telugu Gateway
Telangana

తప్పు టీఎస్‌పీఎస్సీ ది..శిక్ష నిరుద్యోగులకు!

తప్పు  టీఎస్‌పీఎస్సీ ది..శిక్ష నిరుద్యోగులకు!
X

తెలంగాణ నిరుద్యోగ యువతకు బిగ్ షాక్. చాలా కాలం తర్వాత ప్రభుత్వం వరసపెట్టి నోటిఫికేషన్లు ఇచ్చింది అని సంతోషించేలోపే దారుణం చోటు చేసుకుంది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లో పేపర్ లీక్ ల కలకలంతో యువత తీవ్ర నిరాశ నిస్పృహలకు గురి అవుతున్నారు. అత్యంత పక్కాగా పరీక్షలు నిర్వహించాల్సిన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లో సరిపడినంత సిబ్బంది లేరు అనే వార్తలు మరింత షాక్ కు గురిచేసున్నాయి. గత ఏడాది అక్టోబర్ 16 న నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. ఈ పరీక్షను 2.86 లక్షల మంది రాశారు. గ్రూప్ వన్ మెయిన్స్ తేదీలను కూడా ఖరారు చేసినా సమయంలో పేపర్ లీక్ కారణంగా ఇప్పుడు మొత్తం పరీక్షను రద్దు చేయటం యువతను ఆందోళనకు గురి చేస్తోంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించారు.

రద్దు చేసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను ఈ ఏడాది జూన్‌ 11న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇటీవల అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పేపర్‌ లీకేజీ కారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఆధారంగా ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఇవికాకుండా త్వరలో నిర్వహించనున్న మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు సమాచారం.ఈ పేపర్ లీక్ ల అంశం రాజకీయ దుమారం కూడా రేపుతోంది. అధికార బిఆర్ఎస్ పై కాంగ్రెస్, బీజేపీ లు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అంతే కాదు...ఈ పేపర్ లీక్ ల వెనక ప్రభుత్వంలోని వారు ఉన్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే...ప్రభుత్వం మాత్రం ఇందులో ప్రతిపక్షాల కుట్ర ఉంది అంటూ విమర్సలు చేస్తోంది.మరి సిట్ విచారణలో ఇంకా ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

Next Story
Share it