Telugu Gateway
Telangana

క్లౌడ్ బ‌ర‌స్ట్ నుంచి కాపాడే బాధ్య‌త పువ్వాడ అజ‌య్ కు!

క్లౌడ్ బ‌ర‌స్ట్ నుంచి కాపాడే బాధ్య‌త పువ్వాడ అజ‌య్ కు!
X

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ లేవ‌నెత్తిన క్లౌడ్ బ‌ర‌స్ట్ కుట్ర సిద్ధాంతం తెలంగాణ‌లో పెద్ద దుమార‌మే రేపింది. దీనిపై రాజ‌కీయ పార్టీల‌తోపాటు సోష‌ల్ మీడియాలో సీఎం కెసీఆర్ పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లే వెల్లువెత్తాయి. తాజాగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళ్ సై కూడా సీఎం కెసీఆర్ క్లౌడ్ బ‌ర‌స్ట్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ‌లో వ‌చ్చిన వ‌ర‌ద‌కు క్లౌడ్ బ‌ర‌స్ట్ కు సంబంధం లేద‌న్నారు. తాజాగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు చెందిన ర‌వాణా శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్...అదే జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వ‌చ్చి పోల‌వ‌రం ఎత్తు పెంపు వ‌ల్లే భ‌ద్రాచ‌లానికి స‌మ‌స్య వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కారం కావాలంటే ఏపీలో విలీనమైన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలూ తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేశారు. ఏపీకి ఐదు గ్రామాలు దూరంగా ఉంటాయని.. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు.

పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు కోరామని గుర్తు చేశారు. అంతే క్లౌడ్ బ‌ర‌స్ట్ ప‌క్క‌కు పోయి ఇప్పుడు మ‌ళ్లీ కొత్త చ‌ర్చ‌. పువ్వాడ అజ‌య్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ రియాక్ట్ అయ్యారు. విభ‌జ‌న వ‌ల్ల హైద‌రాబాద్ పోయింది..మాకు ఆదాయం పోయింది కాబ‌ట్టి ఇప్పుడు హైద‌రాబాద్ మాకు ఇవ్వ‌మంటే ఇస్తారా? అని ప్ర‌శ్నించారు. గ‌తంలో మాదిరే ఉమ్మ‌డి రాష్ట్రం ఉంచ‌మంటే బాగుంటుందా అని ప్ర‌శ్నించారు. పోల‌వరం ప్రాజెక్టు తో భ‌ద్రాచ‌లానికి ముప్పు అంశం ఉమ్మ‌డి రాష్ట్రంలోనే ప్ర‌స్తావించార‌న్నారు. గోదావ‌రికి భారీ వ‌ర‌ద‌ల వెన‌క విదేశీ శ‌క్తులు..క్లౌడ్ బ‌ర‌స్ట్ అని స్వ‌యంగా సీఎం కెసీఆర్ స్వ‌యంగా అనుమానం వ్య‌క్తం చేసి సంచ‌ల‌న రేపితే..ఆయ‌న కేబినెట్ లోని మంత్రి..కెసీఆర్ వ్యాఖ్య‌ల‌ను ఖండించేలా దేశీయ శ‌క్తులు..పోల‌వ‌రం ప్రాజెక్టుపై ఆరోప‌ణ‌లు చేయ‌టం అంటే ఇది క్లౌడ్ బ‌ర‌స్ట్ క‌వ‌రింగ్ కార్య‌క్ర‌మం అనే చ‌ర్చ సాగుతోంది.

Next Story
Share it