మోడీ-అదానీ అవినీతి అనుబంధం దృష్టి మళ్ళించటానికే
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, అదానీల అవినీతి బంధం దృష్టి మళ్ళించటానికే అగ్నిపథ్ స్కీమ్ ను తెరపైకి తెచ్చారని కెటీఆర్ ఆరోపించారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇటీవల శ్రీలంకకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ప్రధాని మోడీ ఒత్తిడి మేరకే అంబానీకి టెండర్ లేకుండా శ్రీలంకలో విద్యుత్ ప్రాజెక్టు కేటాయించారనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదే అంశంపై శ్రీలంకలో పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా కెటీఆర్ పదే పదే ఈ అంశాన్ని తరచూ ప్రస్తావిస్తున్నారు. కేంద్ర మంత్రులు, బిజెపి సీనియర్ నేతలు అగ్నిపథ్ పై చేస్తున్న వివాదస్పద వ్యాఖ్యలపైనా కెటీఆర్ స్పందించారు. పలు పార్టీలు తీవ్ర స్థాయిలో బిజెపి నేతల వ్యాఖ్యలపై స్పందిస్తున్నాయి. తాజాగా కెటీఆర్ కూడా వీరి తీరుపై మండిపడ్డారు. అగ్నిపథ్ కింద చేరి..తర్వాత బయటకు వచ్చాక యువత డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని ఓ కేంద్ర మంత్రి అన్నారు. అగ్నివీరులను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారని మరో బీజేపీ నేత చెప్పారు. ఇవేనా మీరు యువతకు ఇచ్చే గౌరవం అంటూ వ్యాఖ్యానించారు.