Telugu Gateway
Telangana

ఈ మార్పు దేనికి సంకేతం!

ఈ మార్పు దేనికి సంకేతం!
X

దేశానికే తెలంగాణ మోడల్ ఆదర్శం అని చెప్పుకుంటూ వస్తున్నారు బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంతి కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు. దేశంలో తమకు తప్ప పాలించటం ఎవరికీ రాదు...దేశాన్ని ఎక్కువ కాలంగా పాలించిన కాంగ్రెస్, బీజేపీ లు ఘోరంగా విఫలం అయ్యాయి అని సీఎం కెసిఆర్ అయితే పలు బహిరంగ సభల్లో చెప్పారు. అక్కడితో ఆగక దేశానికీ ఇప్పుడు కావాల్సింది తెలంగాణ మోడల్ మాత్రమే అంటూ చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. ఇక్కడ హై లైట్ ఏమిటి అంటే బుధవారం నాడు తెలంగాణ మున్సిపల్ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయన గత తొమ్మిదేళ్ల కాలంలో మున్సిపల్ శాఖలో చేసిన పనులు, భవిష్యత్ లో చేయబోయే అంశాల గురించి మాట్లాడారు. ఆ సమయంలో కెటిఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మాట్లాడితే ప్రధాని మోడీ, గుజరాత్ మోడల్ పై మండి పడిన కెటిఆర్ సడన్ గా ప్రధాని మోడీ సూచన మేరకే అహ్మదాబాద్ తరహాలో జీహెచ్ఎంసి లో మున్సిపల్ బాండ్ ల రూపంలో కొన్ని నిధులు సేకరించామని తెలిపారు. అంటే మోడీ మోడల్ ఫాలో అయినట్లు కెటిఆర్ ప్రకటించినట్లే అయింది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

రాష్ట్రానికి ఆదాయం 70 శాతం పట్టణాల నుంచే వస్తుంది అని...అందుకే పట్టణాల్లో మౌలిక వసతుల కోసం అప్పు తీసుకొచ్చి దాన్ని భవిష్యత్ కోసం పెట్టుబడి పెడుతున్నాం అన్నారు. రాష్ట్రంలో పట్టణాల్లో వచ్చిన మార్పును ప్రజలు గమనించాలని, గత తొమ్మిదేళ్లలో మార్పు ఉందో లేదో చూడాలన్నారు. బిఆర్ఎస్, బీజేపీ ల మధ్య సయోధ్య కుదిరింది అని వార్తలు వస్తున్న వేళ కెటిఆర్ నోటా మోడీ సూచన మేరకు బాండ్స్ రూపంలో నిధులు సమీకరించాం అన్ని చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికి కేంద్రంపై విమర్శలు చేస్తున్న గతం అంత ఘాటు తగ్గింది. సీఎం కెసిఆర్ కూడా గతంలో తాను మోడీ ఆంత బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ను ఇప్పటివరకు చూడలేదు అని ప్రకటించారు. తర్వాత మళ్ళీ లెక్క మారింది. తిట్ల దండకం అందుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మెల్లగా స్వరం మారుస్తున్నట్లు కనిపిస్తోంది. మారుతున్న రాజకీయ వాతావరణంలో ప్రతి మాట ఇప్పుడు లెక్కలోకి వస్తది అనే విషయం తెలిసిందే.

Next Story
Share it