Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ లో కొత్త కల్చర్ !

బిఆర్ఎస్ లో కొత్త కల్చర్ !
X

అధికార బిఆర్ఎస్ లో ఇది కొత్త కల్చర్. ఒక మంత్రి విదేశీ పర్యటనకు సంబంధించి క్యాబినెట్ లోని ఇతర మంత్రులు ప్రవేట్ యాడ్స్ ఇవ్వటం. అది వాళ్ళ డబ్బు...వాళ్ళ ఇష్టం కానీ...ఈ తరహా సంస్కృతి గతంలో ఎన్నడూ లేదు అని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చిన వారు ఆ మొత్తం ఎలా సంపాదించుకోవాలి అని వాళ్లకు తెలియదా అని ఒక క్యాబినెట్ మినిస్టర్ వ్యాఖ్యానించారు. అయినా ఈ తరహా ప్రచారం మొదటిసారి అని..సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ పుట్టిన రోజుల అప్పుడు పోటీలు పడి యాడ్స్ ఇవ్వటం చూశాం కానీ...ఇది మాత్రం వెరైటీ అని అన్నారు. ఇది అంతా దేనిమీద అంటారా. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కెటిఆర్ విదేశీ పర్యటనకు సంబంధించి. మంత్రి కెటిఆర్ గతంలో కూడా చాలా సార్లు అమెరికా తో పాటు పలు విదేశీ పర్యటనలకు వెళ్లారు..వచ్చారు. కానీ ఈ తరహా ప్లాన్డ్ ప్రచారం ఎప్పుడూ చేయలేదు గురువారం నాటి తెలుగు, ఇంగ్లీష్ పత్రికలు చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. ఒక్క మంత్రులే కాదు...ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రకటనల యజ్ఞంలో తమ వంతు పాత్ర పోషించారు.

గురువారం నాడు ఏ పత్రిక ఓపెన్ చేసిన కెటిఆర్ యాడ్స్ ఫుల్ పేజీలే. ఈనాడు పేపర్ లో అయితే రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జాకెట్ యాడ్ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస గౌడ్ పేరుతో సాక్షి పేపర్ లో జాకెట్ యాడ్ వచ్చింది. నమస్తే తెలంగాణ పత్రికలో ఎమ్మెల్సీ సంబిపూర్ రాజ్, మన తెలంగాణ పేపర్ లో ...ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఆంధ్ర ప్రభ పేపర్ లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి , ఆంగ్ల పత్రికలు డెక్కన్ క్రానికల్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి పేరుతో, టైమ్స్ అఫ్ ఇండియా పత్రికలో ఎంపీ రంజిత్ రెడ్డి అయితే ఏకంగా రెండు పేజీలు. అన్ని యాడ్స్ లో కామన్ పాయింట్ ఒకటే. పర్యటన సమయం పదిహేను రోజులు...కుదిరిన ఎంఓయులు 36000 కోట్లు, రానున్న కొత్త ఉద్యోగాలు 42000 అంటూ పెద్ద ఎత్తున ప్రచారం హోరెత్తించారు. అధికారిక పర్యటనకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు ప్రవేట్ ప్రచారం చేయాల్సిన అవసరం ఏమి ఉంది అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల వేల లబ్ది పొందే ఎత్తుగడగా చెపుతున్నారు.

Next Story
Share it