ఇది మా ధర్మాసనంపై దాడే
తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కృష్ణా బేసిన్ లో విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పై హైకోర్టు సోమవారం నాడు విచారణ జరిపింది. వంద శాతం విద్యుత్ ఉత్పత్తికి వీలుగా తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో 34పై సత్వరమే స్టే ఇవ్వాలని రైతులు తమ పిటీషన్ లో కోరారు. ఈ పిటీషన్ ను జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే తెలంగాణ అడ్వకేట్ జనరల్ ప్రసాద్ ఈ పిటీషన్ ను సీజె ధర్మాసనం ముందు ఉంచాలని కోరారు. ఈ పిటీషన్ ను విచారించాల్సిందిగా సీజె ధర్మాసనమే తమను కోరిందన్నారు. ఏజీ స్థాయి అధికారి ఇలా కోరటం సరికాదని..ఇది తమ ధర్మాసనమే దాడే అని వ్యాఖ్యానించింది. అసలు అంతరాష్ట్ర జల వివాదాలను హైకోర్టు విచారించవచ్చా అని ప్రశ్నించారు.
దీనిపై ట్రిబ్యునల్‌కు పూర్తి అధికారాలు ఉన్నాయి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 11 అంతర్రాష్ట్రాల జల వివాదం ప్రకారం.. ఈ పిటిషన్ అర్హతపై పిటిషనర్‌లను ప్రశ్నించింది. సుప్రీంకోర్టు 2008లో జల వివాదాలపై ఇచ్చిన తీర్పును చదువుకుని మంగళవారం రావాలని వారికి ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. విద్యుత్ ఉత్పత్తిని ఆపాలన్న ఏపీ రైతుల వాదనను అడ్వకేట్ జనరల్ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఈ సమయంలో విద్యుత్ ఉత్పత్తి చేయటం పునర్విభజన చట్టానికి వ్యతిరేకం అని..విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించకూడదని పేర్కొన్నారు. అయితే రేపు హైకోర్టు అందరి వాదనలు విననుంది.