దళితబంధుపై దాఖలైన పిటీషన్లు కొట్టివేత
తెలంగాణ హైకోర్టు దళితబంధు నిలిపివేతకు సంబంధించి దాఖలైన పిటీషన్లను కొట్టివేసింది. ఈ అంశానికి సంబంధించి కోర్టు ముందుకు మొత్తం నాలుగు పిటీషన్లు రాగా..ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమన్నారు. ఒక్క హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు ఉన్నందున అక్కడ మాత్రం దళితబంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే అయితే దళితబంధు ఇప్పటికే అమల్లో ఉన్న కార్యక్రమం అయినందున..దీన్ని ఆపాల్సిన అవసరం లేదంటూ మల్లేపల్లి లక్ష్మయ్యతోపాటు మరికొంత మంది కోర్టును ఆశ్రయించారు.
అయితే ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు తెలిపింది. అయితే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు ఈ పథకం కింద కేటాయించిన మొత్తం నామమాత్రం కాగా..ఒక్క హుజూరాబాద్ కు మాత్రం 2000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కేవలం ఉప ఎన్నిక కోసమే ఇలా చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇది ఎప్పుడో రూపకల్పన చేసిన పథకం అంటూ వాదిస్తూ వచ్చింది.