Telugu Gateway
Telangana

కెసీఆర్ కు హైకోర్టు నోటీసులు

కెసీఆర్ కు  హైకోర్టు నోటీసులు
X

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసు జారీ చేసింది. కెసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీసీఎల్ ఏ, హైద‌రాబాద్ క‌లెక్ల‌ర్ల‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. హైదరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయం కోసం బంజారాహిల్స్​లో 4,935 గజాలు కేటాయిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కోట్లాది రూపాయ‌లు విలువ చేసే ఈ భూమిని కేవ‌లం గ‌జం వంద రూపాయ‌ల లెక్క‌న కేటాయించినట్టు రిటైర్డ్‌ ఉద్యోగి మహేశ్వర్‌రాజ్‌.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

విచారణ అనంతరం హైకోర్టు ప్ర‌తివాదులంద‌రికీ నోటీసులు జారీ చేసి..నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. బంజారాహిల్స్ లోనే ఓ వైపు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాల‌యం ఉండ‌గా..దానికి అత్యంత చేరువ‌గా ఉన్న ప్రాంతంలో జిల్లా పార్టీ ఆఫీసుకు ఏకంగా 4,935 గజాలు కేటాయించ‌టంపై రాజ‌కీయ దుమారం కూడా రేగింది. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం అంటూ కాంగ్రెస్, బిజెపితోపాటు ఇత‌ర పార్టీలు కూడా త‌ప్పుప‌ట్టాయి. ఈ భూమి విలువ ఏకంగా వంద కోట్ల రూపాయలు ఉంటంద‌ని పార్టీల నేత‌లు ఆరోపించారు.

Next Story
Share it