అరెస్ట్ చేసిన పదిహేను నిమిషాల్లో ఎఫ్ఐఆర్ ఎలా సాధ్యం
పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
బండి సంజయ్ కు బెయిల్ మంజూరు
తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేయాలని ఆదేశించింది. సంజయ్ ను అరెస్ట్ చేసిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. అరెస్ట్ చేసిన 15 నిమిషాల్లో ఎఫ్ ఐఆర్ నమోదు ఎలా సాధ్యం అని ప్రశ్నించింది. రాత్రి 10.50 గంటలకు అరెస్ట్ చేసి..11.15 నిమిషాలకు ఎఫ్ ఐఆర్ ఎలా నమోదు చేశారని పేర్కొంది. తనపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను క్వాష్ చేయాలని బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున న్యాయవాది దేశాయ్ ప్రకాశ్ రెడ్డి హైకోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. బండి సంజయ్‌పై అక్రమ కేసులు, సెక్షన్స్ నమోదు చేశారని ఆయన కోర్టుకు నివేదించారు. ఇదంతా ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా చేసిందని అన్నారు. బండి సంజయ్ మేజిస్ట్రేట్ జ్యూడిషల్ కస్టడీ 15 రోజులు చట్టం ప్రకారం సరైంది కాదని దేశాయ్ ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.
దేశాయ్ వాదనలు విన్న హైకోర్టు.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదని పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని పోలీసులను ప్రశ్నించింది. పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు.. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 17వ తారీఖు వరకు రిమాండ్ ఇవ్వడం అనేది సరైనది కాదంటూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ బండి సంజయ్ కరీంనగర్‌లో జాగరణ దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. కోవిడ్ నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీ సంజయ్ దీక్షను భగ్నం చేసి లాఠీఛార్జీలు, తోపులాటల మధ్య అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా జైలుకు తరలించిన విషయం తెలిసిందే.