ప్రజాస్వామ్యంలో పశ్నించేవారూ ఉండాలి
బిజెపి ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రశ్నించే వారు కూడా సభలో ఉండాలని పేర్కొంది. శాసనసభ స్పీకర్ ఈ విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారు కనక సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అందుకే సస్పెన్షన్ కు గురైన ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం ఉదయం స్పీకర్ ను కలవాలని సూచించింది. వీరు స్పీకర్ ను కలిసేలా చూడాల్సిన బాధ్యత అసెంబ్లీ కార్యదర్శికి అప్పగించింది. అదే సమయంలో సస్ఫెన్షన్ పై నిర్ణయాధికారం స్పీకర్ దే అని తెలిపింది. ఎమ్మెల్యేలు సభా హక్కులు ఉల్లంఘనకు పాల్పడినట్టు ఎటువంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. పిటీషనర్ల తరపున కోర్టులో సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదనలు విన్పించారు.
స్పీకర్ నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా మంత్రి తనంత తాను లేచి సస్ఫెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారని..ఇది అంతా చూస్తుంటే ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఇది జరిగిందనే విషయం స్పష్టం అవుతుందన్నారు. తొలుత సోమవారం ఉదయం ఈ కేసును విచారించిన హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేసేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు సిబ్బంది అసెంబ్లీలోనికి వెళ్లి కార్యదర్శికి నోటీసులు అందజేసేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పేర్కొంది. ఇందుకు నగర పోలీస్ కమిషనర్ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కార్యదర్శి నోటీసులు అందుకున్న తర్వాత సాయంత్రం జరిపిన విచారణలో ఎమ్మెల్యేలను స్పీకర్ ను కలవాలని..ఆయనే నిర్ణయం తీసుకుంటారని తెలిపింది.