Telugu Gateway
Telangana

మంత్రి పువ్వాడ అజ‌య్ కు హైకోర్టు నోటీసులు

మంత్రి పువ్వాడ అజ‌య్ కు హైకోర్టు నోటీసులు
X

రాజ‌కీయంగా దుమారం రేపుతున్న ఖ‌మ్మం జిల్లాకు చెందిన సాయి గ‌ణేష్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారం కొత్త మ‌లుపు తిరిగింది. ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని న్యాయ‌వాది హైకోర్టు ఆశ్ర‌యించారు. ఈ పిటీష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు మంత్రి పువ్వాడ అజ‌య్ తోపాటు ప‌లువురికి నోటీసులు జారీ చేసింది. సాయిగ‌ణేష్ ఆత్మ‌హ‌త్య‌కు మంత్రితోపాటు మ‌రికొంత మందిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బిజెపితోపాటు ప‌లు పార్టీలు మంత్రి పువ్వాడ అజ‌య్ పై తీవ్ర విమ‌ర్శ‌లు కూడా చేశాయి. వ్య‌వ‌హారం హైకోర్టు చేర‌టంతో ఈ వ్య‌వహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గడువిచ్చింది ఉన్నత న్యాయస్థానం. మంత్రి పువ్వాడతో పాటు మొత్తం ఎనిమిది మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఏప్రిల్‌ 29వ తేదీకి వాయిదా వేసింది.

పోలీసుల వేధింపుల తాళలేక సాయి గణేష్ ఆత్మహత్య చేసున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ వాదించారు. ఈ కేసును సీబీఐతో ప్రత్యేక దర్యాప్తు చేయించాలని కోరారు. సాయి గణేష్ ఆత్మహత్య పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని తెలిపారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాల తో కౌంటర్ ధాఖలు చేస్తామని ఏజీ తెలపగా.. తదుపరి విచారణను ఏప్రిల్ 29 కి వాయిదా వేసింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ భర్త ప్రసన్నకృష్ణ కలిసి సాయిగణేష్‌పై పలు కేసుల పెట్టించి.. పదేపదే స్టేషనకు పిలిపించి వేధింపులకు గురిచేశారని, అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు చెబుతున్నారు. సాయిగణేష్‌ ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story
Share it