హుజూరాబాద్ దళితబంధుకు 500 కోట్లు విడుదల
ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగానే తెలంగాణ సర్కారు ఆగమేఘాల మీద కదులుతోంది. ఇది ఇప్పటికే అమల్లో ఉన్న స్కీమ్ అని చెప్పుకోవటానికి వాసాలమర్రిలో దీనికి సీఎం కెసీఆర్ శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో పది లక్షల రూపాయల లెక్కన జమ చేశారు. హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టు అని చెప్పి అకస్మాత్తుగా వాసాలమర్రిలో ప్రారంభించారు. ఇది అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే సాగుతోంది. సోమవారం నాడు హుజూరాబాద్ లో ఈ స్కీమ్ అమలుకు 500 కోట్ల రూపాయలు విడుదల చేశారు. నియోజకవర్గంలోని ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నిధులు ఇవ్వనున్నారు.
హుజురాబాద్‌లో 'దళిత బంధు' పైలెట్ ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు ఇప్పటికే హైకోర్టులో పిల్ దాఖలు చేశాయి. అంతే కాదు కొంత మంది కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. కేవలం ఉప ఎన్నిక కోసమే సీఎం కెసీఆర్ దళిత బంధు జపం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే సర్కారు మాత్రం వీటిని తోసిపుచ్చుతూ ఎప్పుడో ఇది తలపెట్టామని..కరోనా కారణంగా ఆలశ్యం అయిందని చెబుతోంది. మరి ఈ దళిత బంధు అధికార టీఆర్ఎస్ ను హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి బయటపడేస్తుందో లేదో వేచిచూడాల్సిందే.