సీఎంలు నియంతలుగా మారుతున్నారు
తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా తెలంగాణ సర్కారు, గవర్నర్ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆమె రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించటం లేదు. దీనిపై ఇటీవల ఢిల్లీలో పర్యటించిన ఆమె ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీతోపాటు హోం మంత్రి అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేశారు. తాజాగా గవర్నర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎంలు నియంతలుగా మారుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని గవర్నర్ స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నానని... ఇద్దరూ భిన్నమైనవారని గవర్నర్ అన్నారు. అయితే వీరిద్దరితో కలసి పనిచేశాక ఇక ఎక్కడైనా పనిచేయగలననే ధైర్యం వచ్చిందన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శలు చేస్తారని, ఇప్పుడు గవర్నర్‌గా ఉన్నప్పుడు విమర్శిస్తున్నారని తమిళిసై అన్నారు. తనను వేరే రాష్ట్రానికి మారుస్తారనేది ఏ మాత్రం వాస్తవం కాదని తమిళిసై స్పష్టం చేశారు.
ఢిల్లీ వెళ్లిన వెంటనే తనపై అసత్య ప్రచారం చేశారని గవర్నర్ తమిళిసై తెలిపారు. సీఎం, గవర్నర్ కలిసి పనిచేయకపోతే ఎలా పాలన ఉంటుందో తెలంగాణను చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇది మంచిది కాదని గవర్నర్ తమిళిసై హితవు పలికారు. తాను రబ్బర్ స్టాంప్ కాదని తెలిపారు. ఎవరు గవర్నర్‌గా ఉన్నా.. ప్రోటోకాల్ పాటించాల్సిందేనని తెలిపారు. రాజ్‌భవన్ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదని అన్నారు. ఏ విభేదాలు ఉన్నా, చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్ తమిళిసై తెలిపారు. దేశంలో గవర్నర్ల విషయంలో ఎలా వ్యవహరించాలో ఓ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ వోపీ) ఉందన్నారు. ఎవరైనా దీన్ని పాటించాల్సిందేనని పేర్కొన్నారు. ఏదైనా విభేదాలు ఉంటే కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ విమర్శలు చేయటం సరికాదన్నారు. సీఎం కెసీఆర్ తో తనకు గ్యాప్ ఉన్న మాట వాస్తవమే అని స్పష్టం చేశారు.