Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో మ‌రో 1433 పోస్టుల భ‌ర్తీకి ఆమోదం

తెలంగాణ‌లో మ‌రో 1433 పోస్టుల భ‌ర్తీకి ఆమోదం
X

తెలంగాణ స‌ర్కారు ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగానే కొత్త ఉద్యోగాల భ‌ర్తీకి వ‌ర‌స‌గా ఆమోదం తెలుపుతూ ముందుకు సాగుతోంది. తాజాగా మున్సిపల్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ రెండు శాఖల్లోని 1,433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలకశాఖ విభాగాధిపతి కార్యాలయంలో 196 పోస్టులు, పబ్లిక్‌ హెల్త్‌లో236, చీఫ్‌ ఇంజనీర్‌ రూరల్‌ వాటర్‌ సప్లైలో 420 పోస్టులు, 350 ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ పంచాయతీ రాజ్‌ జనరల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

ఇప్పటి వరకు 35220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకా మిగిలిన ఆయా శాఖాల్లోని ఖాళీల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థిక శాఖ కరసత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నియామ‌క ఖాళీలు 91,142 ఉండ‌గా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్దీక‌ర‌ణ చేయ‌గా, మిగిలిన 80,039 ఉద్యోగాల భ‌ర్తీ చేస్తామని శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రూప్1 పోస్టులు 503, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, ఫారెస్ట్, ఎక్సైజ్, బ్రెవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it